దేశంలో 6వ సెమీకండక్టర్ యూనిట్.. జతకట్టిన హెచ్‌సీఎల్- ఫాక్స్‌కాన్..

దేశంలో 6వ సెమీకండక్టర్ యూనిట్.. జతకట్టిన హెచ్‌సీఎల్- ఫాక్స్‌కాన్..

భారత్ గడచిన కొన్ని త్రైమాసికాలుగా సెమీకండక్టర్ల తయారీని దేశీయంగా ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక దేశీయ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా చిప్ తయారీలో అనుభవం కలిగిన సంస్థలతో జతకడుతూ తమ తయారీ యూనిట్లను ఇండియాలో ఏర్పాటు చేస్తున్నాయి. సెమీకండక్టర్ మిషన్ లో భాగంగా భారత ప్రభుత్వం నేడు రూ.3వేల 706 కోట్లు ఆ రంగానికి అందించింది.

యూపీలోని జేవర్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న 6వ సెమీకండక్టర్ యూనిట్ కి క్యాబినెట్ అనుమతిచ్చిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని భారత ఐటీ సేవల కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్, తైవాన్ సంస్థ ఫాక్స్‌‌కాన్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి 5 సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు భారత ప్రభుత్వం అంగీకారం తెలిపిందని అన్నారు అశ్వినీ వైష్ణవ్. వాటిలో ఒకటి ఈ ఏడాది తయారీ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. 

 

కొత్తగా హెచ్సీఎల్ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ మెుబైల్స్, ల్యాప్ టాప్స్, ఆటోమెుబైల్స్, పర్సనల్ కంప్యూటర్లు వంటి వాటిలో ఉపయోగించే డిస్‌ప్లే డ్రైవర్ చిప్ లను తయారు చేయనుంది. నెలకు 3కోట్ల 60 లక్షల చిప్స్ తయారీ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయబడుతోంది. అయితే ఈ ప్లాంట్ రానున్న కాలంలో వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనుందని తెలుస్తోంది.