రబీలో ఎరువుల సబ్సిడీకి రూ.22 వేల కోట్లు

రబీలో ఎరువుల  సబ్సిడీకి రూ.22 వేల కోట్లు
  • రబీలో ఎరువుల  సబ్సిడీకి రూ.22 వేల కోట్లు
  • కేంద్ర కేబినెట్ ఆమోదం 
  • డీఏపీకి పాత ధరనే.. బస్తా రూ.1,350 
  • ఎన్పీకే రూ.1,470.. ఎంఓపీ రూ.1,655 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రబీ సీజన్ లో ఎరువుల సబ్సిడీకి రూ.22,303 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్​లో నిర్ణయం తీసుకుంది. మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఫర్టిలైజర్స్ డిపార్ట్​మెంట్ ప్రతిపాదనల మేరకు రబీ సీజన్ (2023 అక్టోబర్ 1 నుంచి 2024 మార్చి 31)లో ఎరువుల సబ్సిడీకి రూ.22,303 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. 

‘‘కేబినెట్ నిర్ణయంతో కిలో నైట్రోజన్​పై రూ.47.02, ఫాస్పరస్​పై రూ.20.82, పొటాష్​పై రూ.2.38, సల్ఫర్ పై రూ.1.89 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. డీఏపీ, ఎన్పీకే బస్తాలు పాత ధరలకే రైతులకు లభిస్తాయి. డీఏపీకి రూ.1,350, ఎన్పీకేకు రూ.1,470 చెల్లించాలి. ఇక ఎస్ఎస్​పీ బస్తా ధర రూ.500గా నిర్ణయించాం. ఎంఓపీ బస్తా ధర గతంలో రూ.1,700 ఉండగా, ఇప్పుడది రూ.1,655కే లభిస్తుంది” అని తెలిపారు.

 గత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీకి రూ.2.55 లక్షల కోట్లు అందించామని పేర్కొన్నారు. కాగా, ఈసారి ఖరీఫ్ సీజన్ లో కేంద్రం రూ.38 వేల కోట్ల సబ్సిడీ ప్రకటించింది. ఇప్పుడు రబీ సీజన్​లో సబ్సిడీ తగ్గించడంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘అంతర్జాతీయంగా ముడి పదార్థాల ధరలు కొంత తగ్గినప్పటికీ, ఇంకా అధికంగానే ఉన్నాయి. పాత ధరలకే రైతులకు ఎరువులు అందేలా సబ్సిడీ నిర్ణయించాం” అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

జమ్రానీ ప్రాజెక్టుకు కేంద్ర సాయం..

ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని గోలా నదిపై నిర్మించనున్న జమ్రానీ డ్యామ్ ప్రాజెక్టును ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకంలో చేర్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.2,584 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, ఇందులో రూ.1,557.18 కోట్లు కేంద్రం భరించనుంది. ఈ ప్రాజెక్టును 2028 మార్చి కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.