అప్పులు ఆదాయానికి మధ్య పొంతన లేదు!

అప్పులు ఆదాయానికి మధ్య పొంతన  లేదు!

రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను ఖర్చులను దాచిపెడుతూ,  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అభివృద్ధి పేరుతో అందిన కాడికి అన్నిచోట్ల లక్షల కోట్ల రూపాయలు అప్పు అతి స్వల్ప కాలంలోనే చేసి, ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేస్తున్న విపరీత ధోరణి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో కనబడుతోంది.  తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​లో  ఆదాయ అంచనాలకు చేస్తున్న ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది.  బడ్జెట్ ప్రతిపాదనలో రెవెన్యూ మిగులు ఉందని  చూపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు తగ్గిపోవడానికి కూడా కారణం అవుతున్నది. ఆదాయం గోరంత పెరిగి ఖర్చు మాత్రం  కొండంతగా పేరుకు పోతుంది అని కాగ్ 2022 మార్చ్ రిపోర్ట్ లో హెచ్చరిక చేసింది.

 అప్పుల తీరు ఇదీ..

స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు క్రమంగా  విద్య,  వైద్యానికి ఖర్చు చేసే  లెక్క ప్రతి సంవత్సరం తగ్గిపోతూ వస్తుంది.  నాణ్యమైన మానవ వనరులు, వైద్య సదుపాయాలు లేనప్పుడు జరుగుతున్న అభివృద్ధి పేద, బడుగు, బలహీన వర్గాలకు అందడం లేదని రూఢీ అవుతున్నది. 2021–22 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ ఆర్ బీఎం ప్రకారం మూడు ముఖ్యమైన లక్ష్యాలను సాధించాలని పెట్టుకుంది. మొదటిది రెవెన్యూ మిగులు చూపించాలని లక్ష్యం పెట్టుకోగా, వాస్తవానికి Rs.9335 కోట్ల రెవెన్యూ లోటు లోకి వెళ్లిపోయింది. ద్రవ్యలోటు కూడా మూడు శాతానికి మించి పెరగకుండా ఉండాలని లక్ష్యం ఉన్నా అది 4.06 శాతంగా నమోదయింది. రాష్ట్ర నికర అప్పులు జీఎస్టీపీలో 25% కన్నా ఎక్కువ ఉండొద్దు అనేది లక్ష్యం.  కానీ నేడు అది 27.40% గా అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలపైన వాటి నిర్వహణపైన శ్రద్ధపెట్టకపోవడం వల్లే ఈ యొక్క దుష్పరిణామాలు కనబడుతున్నాయి. 2020-–21తో పోలిస్తే 2021–22లో 16% అదనంగా అప్పులు నేరుగా ప్రభుత్వం తీసుకుందని కాగ్ వెల్లడించింది. ఈ మేరకు 2022 మార్చి 31 నాటికి నేరుగా ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులు రూ.3.21 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా స్వల్పకాలానికి సంబంధించిన ఖర్చుల నిమిత్తం సైతం రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాన్ని  తీసుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా ఆర్బీఐ నుంచి 2021– 22 లో రూ.22,669 కోట్ల రూపాయలు రుణాన్ని కూడా పొందడం జరిగింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌‌‌‌లు అంటే ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల విషయంలో అసమతుల్యతను అధిగమించడానికి ఉద్దేశించబడ్డాయి. కానీ శాశ్వత ఆర్థిక ఉపశమనానికి మూలం కాదు. ఇట్టి రుణాన్ని  ఆర్బీఐ ద్వారా రాష్ట్రాలు ఆర్థిక రుణ సహాయాన్ని తీసుకుంటాయి. తద్వారా తక్షణమే  చెల్లించాల్సిన పద్దులను  రుణ దాతలకు చెల్లిస్తారు.

నిధుల దుబారా..

ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా అప్పుల రూపంలో సేకరించిన నిధులను మూలధన  వ్యయంగా  ఉపయోగించాలి.  కానీ అప్పుల కింద రూ. 46,994 కోట్లు తీసుకుంటే వాటిలో రూ.28,883 కోట్లు మాత్రమే మూలధన  వ్యయం చేశారు. మిగతా మొత్తం తీసుకున్న అప్పు వడ్డీ చెల్లింపుల కోసం వాడుకున్నారని కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ సంస్థలు డిపార్ట్ మెంట్​లలో కలిసి రూ.40,449 కోట్ల మేర రుణాలకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. ఇలా గ్యారెంటీ ఇచ్చిన అప్పుల విలువ రూ.1,35,289 కోట్లకు చేరుకుందని కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. ఒకవేళ ఆ సంస్థలు రుణాలు చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వమే వాటిని చెల్లించాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి కూడా ప్రభుత్వ అప్పులుగానే భావించవలసి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆదాయంతో పాటు, అప్పులు ఎంత మేరకు తెచ్చి ఖర్చు చేయాలో కూడా పటిష్టమైన నియమాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధ పరిమితులను కూడా పరోక్షంగా దాటవేస్తూ, రాష్ట్ర ఖజానా రాబోయే తరాలకు అత్యంత భారంగా మారే పరిస్థితిని తీసుకువచ్చారు. అనేకమార్లు మేధావులు,  ప్రతిపక్షాలు రాష్ట్రం పెడుతున్న దుబారా ఖర్చుపై ప్రశ్నలు లేవనెత్తినా.. ప్రతిసారి చర్చను పక్కదారి పట్టించి పబ్బం గడుపుకుంటున్నారు. 

అప్పులు బారెడు అభివృద్ధి జానెడు

మార్చి 2022 నాటికి ప్రభుత్వం వివిధ బ్యాంకుల నుంచి 75 వేల కోట్ల ఆఫ్ బడ్జెట్ రుణాలు కూడా తీసుకుంది. వీటిని చెల్లించడం కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచే ఖర్చు చేయాల్సి ఉన్నా బడ్జెట్ లెక్కల్లో చూపించలేదని తెలియజేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి 2021–22లో రెవెన్యూ రాబడిలో ప్రభుత్వం వేసిన అంచనాల కన్నా రూ. 48,659 కోట్లు తగ్గిందని ఇది పూర్తిగా ఆర్థిక నిర్వహణ లోపమేనని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిమితి మించి అప్పులు చేసినా కూడా నేడు సబ్బండ వర్గాలకు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందించడంలో విఫలమవుతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వడంలో కూడా విఫలమైంది. ఈ సీజన్లో నేటికీ ఆరు ఎకరాలు పైబడి కలిగిన రైతులకి రైతుబంధు ఇవ్వలేకపోతోంది. రైతుల రుణమాఫీ విషయంలో కూడా తీవ్రమైన జాప్యం చేస్తూ కాలం గడుపుతుంది. ఇలా అనేక రకాల పథకాలకి నేడు డబ్బులు లేని పరిస్థితి ఒకవైపు అయితే, రాబోయే రోజుల్లో ఎన్నికల దృష్ట్యా మరికొన్ని సంక్షేమ పథకాలని ప్రకటించాలని ప్రభుత్వం తెగ ఆరాటపడుతున్నట్టుగా అసెంబ్లీ సమావేశాల్లో కనపడింది. ప్రస్తుత ఖర్చులను పూర్తిస్థాయిలో పునర్ సమీక్ష చేసి ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తు తరాల భవిష్యత్తును అంధకారం చేయకుండా హేతుబద్ధంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ఖర్చు వివరాలతో పాటు, అప్పుల విషయాలను కూడా ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో  పార్టీలు హామీలు ఇవ్వడంలో పోటీపడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత గడ్డు పరిస్థితుల్లోకి నెట్టి వేయకుండా ఉండాలి. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే  ఈ తరంపైన, రాబోయే తరాల పైన ఏరకమైన ప్రభావం ఉంటున్నది అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం.

- చిట్టెడ్డి కృష్ణా రెడ్డి,
అసిస్టెంట్ ప్రొఫెసర్,  
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ