- ఈనెల 13న ఎన్నికలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ
- ఓటర్లను కాపాడుకునేందుకు ఇరువర్గాలు ముమ్మర ప్రయత్నాలు
నల్గొండ, వెలుగు : మదర్ డెయిరీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. శని, ఆదివారాలు సెలవు రోజులు కాగా.. సోమవారం నుంచి క్యాంపు పాలిటిక్స్ షురూ చేసేందుకు ఇరు వర్గాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఆలేరు కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి మధ్య నువ్వా నేనా..అనే రీతిలో హోరాహోరీ నడుస్తున్నాయి. ఈనెల13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరువర్గాలు తమ ఓటర్లను క్యాంపులకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. 297 మంది సొసైటీ చైర్మన్లు ఓటర్లు. దీంట్లో కాంగ్రెస్ఓటర్లు రెండొందలకు పైగా ఉండగా.. బీఆర్ఎస్ ఓటర్లు 80 మందికి పైగా ఉన్నారు. ఎ న్నికల నాటికి ఓటర్లు చేజారిపోకుండా ఉండేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. డెయిరీ ఎన్నికల బాధ్యతలు నిర్వరిస్తున్న ఎమ్మెల్యే అయిలయ్య తనవర్గాన్ని కాపాడుకునేందుకు వ్యూహాన్ని రూపొందించారు.
డీసీసీబీలో మెజార్టీ డైరెక్టర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నప్పటికీ తన చైర్మన్పీఠాన్ని కాపాడుకోవడంలో మహేందర్‌రెడ్డి విఫలమయ్యారు. అవిశ్వాస తీర్మానం పెట్టేవరకు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా ఆలేరులో రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఓటుకు రూ.30 వేల వరకైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడేది లేదని ఇరువర్గాలు సవాల్చేస్తున్నాయి. అయిలయ్య మద్దతుదారుడు మధుసూదన్ రెడ్డి చైర్మన్అభ్యర్థిగా బరిలో ఉండగా, మహేందర్‌రెడ్డి ప్యానల్ నుంచి కొండల్‌రెడ్డి పోటీలో ఉన్నారు. డెయిరీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్అనేది సర్వసాధారణం. అయితే ఆలేరులోనే 130 మంది పైగా ఓటర్లు ఉండటంతో ఇరువర్గాల్లో టెన్షన్నెలకొంది.