
యూపీఎస్సీ పలు మంత్రిత్వ శాఖలలో లాటరల్ ఎంట్రీ ద్వారా పోస్టుల భర్తీపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్‌సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈమేరకు యూపీఎస్‌సీ ఛైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొంది కేంద్రం.
యూపీఎస్సీ మొత్తం 45 జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీ పోస్టులను లాటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉండే ఈ పోస్టులకు గాను ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకంపై వ్యతిరేక వ్యక్తమవుతుండటంతో కేంద్ర మంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విధానం ద్వారా ప్రైవేట్ రంగంలో 15ఏళ్ళ అనుభవం కలిగి.. 45ఏళ్ళ వయసు పైబడి ఉన్న ఉద్యోగులను బ్యూరోక్రసిలో చేర్చుకునే వెసలుబాటు ఉంది.సాధారణంగా, లాటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫోఎస్ సహా ఇతర గ్రూప్ A క్యాడర్ కి చెందిన అధికారులకు అవకాశం కల్పిస్తారు. అయితే, ఆ విధానం ద్వారా జరిగే రిక్రూట్‌మెంట్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కోటా, రిజర్వేషన్లు లేనందున కేంద్ర ప్రభుత్వ లాటరల్ ఎంట్రీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.