సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 14 వందల మంది పింఛన్ల తొలగింపు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 14 వందల మంది పింఛన్ల తొలగింపు
  • భారీ సంఖ్యలో పింఛన్లు తొలగిస్తున్న ప్రభుత్వం
  • జిల్లా వ్యాప్తంగా 14 వందల మంది పింఛన్ల తొలగింపు  
  • లబ్ధిదారుల పేర్ల మీద భూమి, కారు ఉంటే రద్దు
  • ధరణి, ఆర్టీఏ ఆఫీసులో వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు
  • వెరిఫికేషన్​ చేయకుండానే తొలగిస్తున్నారని లబ్ధిదారుల ఆవేదన

‘‘చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. అతడి పేరుపై గతంలో కారు ఉండగా వ్యక్తి చనిపోయాక కారును అమ్మేశారు.  అయితే కారు రిజిస్ట్రేషన్ మార్పు కాకపోవడంతో వ్యక్తి  భార్యకు ఒంటరి మహిళా పింఛన్​ శాంక్షన్​ అయిన నెల రోజులకే ప్రభుత్వం కట్​చేసింది’’. 

సూర్యాపేట, వెలుగు: అప్లికేషన్లు తీసుకున్న మూడున్నరేండ్ల తర్వాత ఇటీవల పింఛన్లు శాంక్షన్​చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నెల రోజులకే అనర్హులున్నారని కట్​చేస్తుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.  మూడెకరాల భూమి, సొంత కారు ఉన్న వారి వివరాలను  సీసీఎల్ఏ, ఆర్టీఏ ఆఫీసుల నుంచి తీసుకొని   అధికారులు ఏరివేత ప్రక్రియ చేపట్టారు. అయితే క్షేత్రస్థాయిలో  ఎంక్వైరీ చేయకుండా  తొలగిస్తుండడంతో అర్హులైన వారు  కూడా పింఛన్లు కోల్పోతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

జిల్లాలో 34,822 కొత్త పింఛన్లు

సూర్యాపేట జిల్లాలో గతంలో మొత్తం 1,23,006 మంది ‘ఆసరా’ లబ్ధిదారులున్నారు. వృద్ధాప్య, ఒంటరి మహిళా, దివ్యాంగులు,  గీతా, చేనేత కార్మికుల పింఛన్లకు చెందిన 13,761 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.  దానికి తోడు ప్రభుత్వం పింఛన్​అర్హత వయస్సు 57 ఏండ్లకు తగ్గించడంతో 26,704 మంది కొత్తగా అప్లై చేసుకున్నారు. ఈ లెక్కన జూన్ నుంచి కొత్త పింఛన్లు  శాంక్షన్​చేసిన ప్రభుత్వం 34,882మందిని అర్హులను గుర్తించి కార్డులను జారీ చేసింది. 

భారీ సంఖ్యలో తొలగింపు  
ఒకే  ఇంట్లో ఇద్దరికి, ముగ్గురికి పింఛన్లు శాంక్షన్ చేయడంతో పాటు కుటుంబంలో ఉద్యోగాలు ఉన్న వారికి, భూములు ఉన్న వారికి కూడా మంజూరు చేశారనే విమర్శలు వచ్చాయి.  దీంతో ప్రభుత్వం  సీసీఎల్ఏ, ఆర్టీఏల నుంచి వివరాలు సేకరించింది.  చనిపోయిన వారి పేర్లను తొలగించడంతో పాటు ఒకే ఇంట్లో ఇద్దరికి శాంక్షన్​అయిన పింఛన్లలో ఒకటి కట్​చేస్తుంది. ఇలా దాదాపు తొలగించిన  పింఛన్లలో  5 వేల మంది అనర్హులు 57 ఏళ్లు నిండిన వారిలోనే ఉన్నారని తెలుస్తుండగా, ఆఫీసర్లు 1400 మందిని మాత్రమే  తొలగించినట్లు చెప్తున్నారు.  

వెరిఫికేషన్ లేకుండానే తొలగింపు
ప్రభుత్వం ఫీల్డ్ లెవెల్ లో ఎంక్వైరీ చేసి అనర్హులను తొలగిస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అర్హత ఉన్న వారినే ఎక్కువగా తొలగించినట్లు తెలుస్తోంది. ఆఫీసర్లకు ఎలాంటి  డాటా ఇవ్వకుండానే పై లెవెల్ లోనే  పింఛన్లు కోత పెడుతుండగా.. అర్హత ఉన్నవారు లబోదిబోమంటున్నారు.  ధరణి లోపాల వల్ల తమ పింఛన్​కూడా పోతుందని ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.  ఇకనైనా వెరిఫికేషన్​ చేసి అర్హత ఉన్నవారి పింఛన్లు కట్​ చేయొద్దని కోరుతున్నారు. అధికార పార్టీ నేతల సూచనతో టీఆర్ఎస్ ​ పార్టీ మారిన వారి పింఛన్లు కట్​చేస్తున్నారని హజూర్​నగర్ ​మండలం బూరుగుగడ్డ గ్రామానికి చెందిన రాములమ్మ అనే  మహిళ ఆరోపించింది. తనకొడుకు  బీఎస్పీ లో చేరాడనే  పింఛన్ ​కట్​చేశారని ఆమె వాపోయింది.  

కారణం లేకుండానే తొలగించారు 
నాకు 66 ఏండ్లు వ్యవసాయ కూలీగా పనిచేస్తా. ఆరేండ్ల కింద వృద్ధాప్య పింఛన్​కోసం అప్లై​చేశాను. ఇటీవల పింఛన్​వచ్చిందని ఆఫీసర్లు కార్డు ఇచ్చారు.  తీరా పింఛన్​తీసుకోవడానికి వెళ్తే డిలీట్​ అయ్యిందని చెప్తున్నారు. కారణం లేకుండా ఎందుకు తొలగించిన్రో అర్థమైతలేదు. 
- సాధనాల నర్సయ్య, హుజూర్ నగర్ 

అర్హత లేకుంటే రద్దు 
ప్రభుత్వం కారు, భూమి ఉన్న వారిని అనర్హులుగా గుర్తించి పింఛన్లను రద్దు చేస్తోంది. అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడి పింఛన్​ తొలగించలేదు. 
- కిరణ్ కుమార్, డీఆర్డీఏ పీడీ, సూర్యాపేట