పీసీసీ చీఫ్ పోస్టుకు అభ్యర్థులు కరువు

పీసీసీ చీఫ్ పోస్టుకు అభ్యర్థులు కరువు

పీసీసీ చీఫ్​ పోస్టా.. ఇస్తే చూద్దాం లే!

ఆ పదవిపై పెద్దగా ఆసక్తిచూపని రాష్ట్ర కాంగ్రెస్​ ముఖ్యులు

హైకమాండ్ ఇస్తే ఓకే అనే ధోరణి 

స్పెషల్‌గా ప్రయత్నాలు బంద్​

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో ఇబ్బందులు

అసెంబ్లీ ఎన్నికలకు చాలా టైం ఉండడమూ కారణమే

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ పదవి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఆరు నెలల క్రితం వరకు ఈ పోస్టు కోసం ఎక్కువ మంది నేతలు ప్రయత్నించారు. మున్సిపల్ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ పోస్టు దక్కించుకునేందుకు పలువురు సీనియర్ నేతలు, ముఖ్యనేతలు లాబీయింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడంలేదు. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా ఇంకా నాలుగేండ్ల గడువు ఉంది. ఈ ఎన్నికలకు రెండేండ్ల ముందు అంటే మరో రెండేండ్ల తర్వాత పీసీసీ చీఫ్ పోస్టు తీసుకుంటేనే మేలు అనే ఆలోచనలో ఎక్కువ మంది నేతలు ఉన్నారు. ఇప్పటికిప్పడు పీసీసీ చీఫ్ పోస్టు తీసుకున్నా.. నాలుగేండ్ల దాకా దాన్ని మెయింటెన్ చేయడం రాజకీయ వ్యూహాల పరంగా కొంత సవాల్​తో కూడుకుని ఉంటుందని, ఆర్థికంగానూ ఒకింత భారమేనని సీనియర్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయపరంగా మరో రెండేండ్ల వరకు అంతా డల్​గానే ఉంటుందని, ఇప్పటికిప్పడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాల విషయంలోనూ పెద్దగా ఏమీ చేసే పరిస్థితి ఉండదని వీరు అనుకుంటున్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఎఫెక్ట్​

త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పీసీసీ చీఫ్ పోస్టుపై కాంగ్రెస్​ ముఖ్యనేతలు ఆసక్తి చూపకపోవడానికి ఒక కారణంగా కనిపిస్తున్నాయి. వచ్చే జనవరిలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 డివిజన్లు ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి డివిజన్ల సంఖ్య ప్రకారం చూసినా జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కొవడం రాజకీయంగా పెద్ద పరీక్షగానే ఉంటుందని, ఆర్థికంగానూ భారమేననే ఆలోచనలో పీసీసీ చీఫ్ పోస్టు ఆశించే నేతలు ఉన్నారు. పీసీసీ చీఫ్​ పోస్టు పదవి దక్కించుకుంటే.. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా కనీసం 30 డివిజన్లయినా గెలవాలని, లేకపోతే ఆ పోస్టులో కొనసాగడం ఒకింత ఇబ్బందికరంగా ఉంటుందని వీరు భావిస్తున్నారు. ఇప్పుడు ఎవరు పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టినా వారికి జీహెచ్ఎంసీ ఎన్నికలు మొదటి ఎన్నికలు అవుతాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మొదటి పరీక్షలోనే సక్సెస్ కాలేకపోయారనే విమర్శలు వస్తాయి. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాకపోతే.. పార్టీలోని ప్రత్యర్థుల నుంచే విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుంది. సొంత పార్టీలోని నేతల విమర్శలు పెరిగితే పీసీసీ చీఫ్ పోస్టు నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుంది. ఇదే జరిగితే తీరా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంత పార్టీలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో పీసీసీ  చీఫ్ పోస్టు కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్​ ముఖ్యనేతలు ప్రస్తుతానికి ఆసక్తి చూపడంలేదు. అందుకే ఈ విషయంలో  ప్రస్తుతం ఏ ఒక్క కీలక నేత కూడా స్వయంగా వెళ్లి ఏఐసీసీ వద్ద పెద్దగా ప్రయత్నాలు చేయడంలేదు. అయితే.. ఏఐసీసీ నిర్ణయం తీసుకుని తమకు అవకాశం ఇస్తే మాత్రం చూద్దామనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్​ ముఖ్యులు ఉన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్​పోస్టు తీసుకుంటే అది హైకమాండ్​ నిర్ణయంగా ఉంటుందని, సొంత పార్టీలోని వారు కొన్నేండ్లు ఓపికంగా ఉంటారని వీరు భావిస్తున్నారు.

For More News..

జగన్ జాగ్రత్త.. కేసీఆర్ వాడుకుని వదిలేస్తరు

రేవంత్​ ఓ కబ్జా కోరు

చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ఆంధ్రాలో తెలంగాణ లిక్కర్.. కోట్లు దండుకుంటున్న బోర్డర్ వైన్ షాపులు

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!