ముస్లింలు భారత్‌లో ఉండొద్దనే వ్యక్తులు హిందువులే కాదు

ముస్లింలు భారత్‌లో ఉండొద్దనే వ్యక్తులు హిందువులే కాదు

ఘజియాబాద్: ప్రజలను వారి నమ్మకాలు, మత విశ్వాసాల ప్రాతిపదికన విభజించలేమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో ఉందని కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడిన భగవత్.. ఇలాంటి ఉచ్చులో ముస్లింలు పడరాదని కోరారు. ఘజియాబాద్‌లో ‘హిందూస్తానీ ఫస్ట్’ అనే థీమ్‌తో ముస్లిం రాష్ట్రీయ మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ పైవ్యాఖ్యలు చేశారు. మూకదాడులకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఏ హిందువైనా ముస్లింలు మన దేశంలో ఉండొద్దని అంటే అలాంటి వారిని హిందువులుగా చూడమన్నారు. గోవు ఓ పవిత్రమైన జంతువని.. కానీ ఇతరులను  కించపరిచే ప్రజలు హిందుత్వానికి వ్యతిరేకంగా వెళుతున్నారని భగవత్‌ విమర్శించారు. అలాంటి వారిపై ఎటువంటి పక్షపాతం లేకుండా చట్టం తనదైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

‘మూకదాడులను మేం సమర్థించం. అలాంటి దాడులకు పాల్పడే వారిని హిందూత్వకు వ్యతిరేకులుగానే చూస్తాం. అయినా కొన్నిసార్లు మూకదాడుల విషయంలో తప్పుడు కేసులను బనాయించడం చూస్తున్నాం. ఈ సందర్భంగా ముస్లింలకు ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా.. మన దేశంలో ఇస్లాం ప్రమాదంలో పడిందని కొందరు తప్పుడు పుకార్లు సృష్టిస్తున్నారు. ఇలాంటి ట్రాప్‌లో పడొద్దని కోరుతున్నా. అందరమూ కలసికట్టుగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం. మన పూర్వీకుల ఘనమైన వారసత్వంతోపాటు జాతీయవాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్దాం. హిందూ, ముస్లింల ఐక్యతపై కొందరు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. హిందూ, ముస్లింలు ఒక్కటే.. వేర్వేరు కాదు. మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటే. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం. ఇక్కడ హిందువులో, ముస్లింలో ఆధిపత్యం చెలాయించకూడదు. కేవలం భారతీయుల ఆధిపత్యం మాత్రమే ఉండాలి’ అని భగవత్ పేర్కొన్నారు.