రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై కోర్టుల జోక్యం సరి కాదు: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై కోర్టుల జోక్యం సరి కాదు: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
  • అలా చేస్తే రాజ్యాంగపరంగా గందరగోళం
  • టైమ్‌లైన్‌ విధించడమంటే వాళ్ల స్థాయిని తగ్గించడమే 
  • ఏవైనా లోపాలుంటే రాజకీయంగా, రాజ్యాంగపరంగా సరిదిద్దాలి 
  • గవర్నర్​ వ్యవస్థ అంటే పోస్టాఫీస్​ లాంటిది కాదని వ్యాఖ్య

న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదని.. అలా చేస్తే రాజ్యాంగపరంగా గందరగోళానికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లుల ఆమోద ప్రక్రియలో ఏవైనా లోపాలుంటే రాజకీయంగా, రాజ్యాంగపరంగా సరిదిద్దాలని.. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవడం కరెక్టు కాదని పేర్కొంది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గతంలో నోటీసులు ఇవ్వగా.. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

‘‘బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలకు లేని అధికారాలను కల్పించినట్టవుతుంది. తద్వారా అధికార విభజన దెబ్బతింటుంది. ఇది రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుంది” అని అందులో పేర్కొన్నారు.

‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆర్టికల్ 142 కింద తనకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు సవరించలేదు. బిల్లుల ఆమోదానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. కానీ దాన్ని కారణంగా చూపి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తే..  వాళ్ల స్థాయిని తగ్గించినట్టవుతుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆఫీసులు ప్రజాస్వామ్య పాలనకు సంబంధించి ఉన్నత ఆదర్శాలకు ప్రతీక. ఏవైనా లోపాలుంటే రాజకీయంగా, రాజ్యాంగపరంగా సరిదిద్దాలే తప్ప.. న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరికాదు” అని తెలిపారు.

ఇదీ వివాదం..
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆర్ఎన్‌.రవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దే ఉంచుకోవడాన్ని సవాల్‌ చేస్తూ తమిళనాడు సర్కార్‌‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. అసెంబ్లీలు ఆమోదించే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు 3 నెలల గడువు విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పు ఇచ్చింది. అయితే రాష్ట్రపతికి గడువు విధించవచ్చా? అని సుప్రీంకోర్టును ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము న్యాయ సలహా కోరారు.

ఈ సందర్భంగా 14 ప్రశ్నలను లేవనెత్తారు. రాష్ట్రపతి లేవనెత్తిన అంశాలపై చీఫ్‌ జస్టిస్ బీఆర్ గవాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఈ నెల 19 నుంచి విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్రం, రాష్ట్రాలను గతంలోనే ఆదేశించింది.