జోరందుకున్న కార్ల సేల్స్

జోరందుకున్న కార్ల సేల్స్

న్యూఢిల్లీ : చిప్‌ల​ సప్లయ్​ మెరుగుపడటంతో ఆగస్టు నెలలో దేశంలో కార్ల అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ నెలలో ఫ్యాక్టరీల నుంచి డిస్పాచ్​లు మూడో వంతు పెరిగినట్లు అంచనా. పండగ సీజన్​లో కస్టమర్ల డిమాండ్​ తట్టుకోవడానికి డీలర్లూ తమ స్టాక్స్​ పెంచుకున్నారు. ఫలితంగా కార్ల సేల్స్​ జోరందుకున్నాయి. ఆగస్టు 2022లో ఈ అమ్మకాలు 29–31 శాతం పెరిగి 3.40 లక్షల యూనిట్లకు మించినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. మే నెల మినహాయిస్తే,  ఈ స్థాయిలో కార్ల హోల్​సేల్​ సేల్స్​ పెరగడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. అంతకు ముందు ఏడాది అమ్మకాలు బాగా తక్కువగా రికార్డవడంతో ఈ ఏడాది మే నెలలో డిస్పాచ్‌లు​ ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. కిందటేడాది కరోనా మహమ్మారి సెకండ్​వేవ్ తో పాటు, సెమికండక్టర్ల కొరత కూడా కార్ల అమ్మకాలపై ఎఫెక్ట్​ చూపింది.

చిప్‌​ సప్లయ్​ బెటర్​...

చిప్‌​ సప్లయ్​ బెటరవడంతో జులై నెలలో కార్ల అమ్మకాలు 3.41 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఈ కేలండర్​ ఇయర్​లో ఫ్యాక్టరీల నుంచి డిస్పాచ్​లు 3 లక్షల యూనిట్లకు మించడం ఇది అయిదోసారి. అంతకు ముందు ఏడాదిలో సగటున నెలకు 2,56,868 యూనిట్లను ఫ్యాక్టరీలు డిస్పాచ్​ చేశాయి. మన దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు హోల్​సేల్​ డిస్పాచ్‌ల​ డేటానే ఇస్తాయి. రిటెయిల్​ సేల్స్​ డేటాను అవి ప్రకటించవు.​ 

పండగ సీజన్​ బాగుంటుంది

రాబోయే నెలల్లో కార్ల అమ్మకాలు మరింత జోరందుకుంటాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్స్​ జరిగిన 50 లక్షల కార్లను ఫ్యాక్టరీలు ఇంకా డెలివరీ ఇవ్వాల్సి ఉంది. ఈసారి పండగ సీజన్​లో కార్ల సేల్స్​ ఎక్కువవుతాయని మారుతి సుజుకి ఇండియా సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ శశాంక్​ శ్రీవాస్తవ చెప్పారు. తమ  కొత్త లాంఛ్​లన్నింటినీ కస్టమర్లు బాగా రిసీవ్​ చేసుకున్నారని ఆయన అన్నారు. కొత్త బ్రెజాకు లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించారు. దీంతో వచ్చే నెలలోనూ అమ్మకాల ఊపు ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 

మహమ్మారి దెబ్బ....

కరోనా దెబ్బకి కార్ల అమ్మకాలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. 2020లో 24.3 లక్షల యూనిట్లకే ఇవి పరిమితమయ్యాయి.  ఆ తర్వాత కాలంలో  డిమాండ్ క్రమంగా ​ పుంజుకుంటోంది.  కస్టమర్ల డిమాండ్​కు తగినట్లుగా సప్లయ్​ చేయలేకపోతున్నాయి ఆటోమొబైల్​ కంపెనీలు. దీంతో వెయిటింగ్ ​పిరియడ్​ బాగా పెరిగింది. చిప్స్​, కొన్ని విడిభాగాల కొరత కారణంగానే ఆటోమొబైల్​ కంపెనీలు తమ డిస్పాచ్‌ల​ను పెంచుకోలేకపోతున్నాయి. చిప్స్​ కొరతతో గత ఏడాదిన్నర కాలంగా ఆటోమొబైల్​ పరిశ్రమ ఇబ్బందులెదుర్కొంటోంది. ఈ కేలండర్​ ఏడాది మొదటి నుంచీ డిమాండ్​ పెరగడం చూస్తున్నామని కియా ఇండియా సేల్స్​ హెడ్​ హర్దీప్​ సింగ్​ బ్రార్​ చెప్పారు. ఆగస్టు నెలలోనూ సేల్స్​ 30 శాతం మించి పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సేల్స్​ తమ అంచనాలకు తగినట్లుగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే ట్రెండ్​ రాబోయే నెలల్లోనూ కొనసాగుతుందని బ్రార్​ చెప్పారు.

ఓ వైపు సప్లయ్​ మెరుగవడంతోపాటు చాలా కంపెనీలు కొత్త మోడల్స్​ను లాంఛ్​ చేయడంతో కస్టమర్ల నుంచి డిమాండ్​ కూడా ఎక్కువవుతోంది. మారుతి సుజుకి కొత్త బ్రెజా, గ్రాండ్​ విటారా, టొయోటా హైరైడర్​, హ్యుందాయ్​ వెన్యూ, టస్కన్, టాటా కొత్తగా పంచ్​, మహీంద్రా అండ్​ మహీంద్రా కొత్త ఎక్స్​యూవీ 700, కొత్త స్కార్పియో మోడల్స్​ను ఇటీవల కాలంలో మార్కెట్లోకి తెచ్చాయి. సప్లయ్​ చెయిన్​ మెరుగుపడటంతో ప్రొడక్షన్​ పెరిగిందని జాటో డైనమిక్స్​ (కన్సల్టింగ్​ కంపెనీ) ప్రెసిడెంట్​ రవి భాటియా చెప్పారు. దీంతో వెయిటింగ్​ టైమును తగ్గించడం ఒరిజినల్​ ఎక్విప్​మెంట్​ మాన్యుఫాక్చరర్స్​ (ఓఈఎం)లకు వీలవుతుందని పేర్కొన్నారు. జులై, ఆగస్టు అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని, రాబోయే నెలలలోనూ ఇదే జోరు కొనసాగుతుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు హీరో, బజాజ్‌ ఆటో, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వంటి టాప్ టూ వీలర్ కంపెనీల సేల్స్‌ కూడా ఆగస్టులో పెరిగాయి.

పెండింగ్​ బుకింగ్స్​...

డెలివరీ ఇవ్వాల్సిన కార్లు 6.5 లక్షల నుంచి 7 లక్షల దాకా ఉంటాయని ఎక్స్​పర్టులు వెల్లడిస్తున్నారు. డెలివరీల విషయంలో ఆటోమొబైల్​ కంపెనీలు జాగ్రత్త పడాల్సి ఉందని, బుకింగ్స్​ తీసుకున్న కార్లను డెలివరీ చేయడం చాలా ముఖ్యమని మారుతి సుజుకి డైరెక్టర్​ శ్రీవాస్తవ పేర్కొన్నారు.