
- సురక్షితంగా బయటపడిన ఏడుగురు
చౌటుప్పల్, వెలుగు : ఉధృతితో వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. కాగా.. అందులోని ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన జక్కల మల్లేశ్, మమత దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు, సైదులు, లింగస్వామి, డ్రైవర్ తో కలిసి కారులో బంధువుల ఇంట్లో పెండ్లి వేడుకలో పాల్గొనేందుకు గురువారం రాత్రి బయలుదేరారు.
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లికి వెళ్లాల్సి ఉండగా.. అదేరోజు రాత్రి భారీ వానపడడంతో నేలపట్ల వద్ద వాగులో వరద ఉధృతంగా పారుతోంది. ఇది తెలియకపోవడంతో డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చారు. వరద తీవ్రతకు మధ్యలోనే కారు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైనవారు వెంటనే కారులోంచి బయటపడ్డారు.
అనంతరం కారు కొంతదూరం నీటిలో కొట్టుకుపోయింది. ఇంటికి వెళ్లిపోయి శుక్రవారం ఉదయం అక్కడి వెళ్లి కారును బయటకు తీశారు. బంగారం, వస్త్రాలు,ల్యాప్ టాప్ లు ఉన్నాయి. ఇంకా వరద తీవ్రత తగ్గకపోవడంతో ఆ రూట్ లో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.