
ప్లాస్టిక్ కవర్లు లేనప్పుడు షాపులోళ్లు సరుకులను పేపర్లల్ల పొట్లం కట్టి ఇస్తుండె. నూనె లాంటి వాటికైతే.. మనం ఇంట్లకెల్లే క్యాన్ తీసుకుపోతుంటిమి. వాటిని పేపర్లల్ల పొట్లం కట్టలేరు కదా మరి. కారిపోద్ది కదా. మరి, బీర్లు అనంగనే మనకు గుర్తొచ్చేది సీసానే. కాకపోతే, ఓ కంపెనోళ్లు కొత్తగా ఆలోచిస్తున్నరు. పేపర్ బాటిల్లో బీరు పొయ్యాలని చూస్తున్నరు. ప్రముఖ బీర్ల కంపెనీ కార్ల్స్‌బర్గ్ ఇదే ఆలోచన చేసింది. దానికి సంబంధించి రెండు ప్రొటోటైప్ బాటిళ్లనూ గురువారం విడుదల చేసింది. అరె, పేపర్లపోస్తె బీరు కారిపోదా అన్న డౌటు వచ్చింది కదా. అందుకే అలా కాకుండా వేరే ఆలోచన చేసింది. బాటిల్ అయితే, చెక్క నుంచి తయారు చేసిన కార్టనే ఉంటుంది. లోపల మాత్రం పల్చటి పెట్ పొరను ఏర్పాటు చేసింది.
ఆ పెట్ పొర బీరు బయటకు కారిపోకుండా చూస్తుంది. ఇది ఒక రకం బాటిల్. ఇంకో రకంలోనేమో ప్రకృతి ఇచ్చే వాటితోనే లైనింగ్ వేసింది. అది కూడా బీరు బయటకు కారకుండా కాపాడుతుందట. ప్రస్తుతం వీటిని కంపెనీ టెస్ట్ చేస్తోంది. అల్యూమినియం, గ్లాస్‌లతో పోలిస్తే ఇది పర్యావరణ హితమని కంపెనీ అంటోంది. అల్యూమినియం, గ్లాసులను తయారు చేసేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ విపరీతంగా విడుదలవుతుందని, కానీ, ఈ పేపర్ బాటిళ్లతో అలాంటి నష్టాలేవీ ఉండవని చెబుతోంది. 2015లోనే కొత్త ప్యాకింగ్ పద్ధతులపై కార్ల్స్‌బర్గ్ పనిచేయడం మొదలుపెట్టింది. ఎప్పటినుంచో ఈ పేపర్ బాటిళ్లపై దృష్టిపెట్టినా చాలా టైం తీసుకుంది. దానికీ కారణం లేకపోలేదు. బీరు రుచి పోకుండా చూసేందుకు ఎన్నో పద్ధతులపై కంపెనీ రీసెర్చ్ చేసింది. కోకాకోలా, అబ్సొల్యూట్, లోరియల్ వంటి కంపెనీలూ కార్ల్స్‌బర్గ్ రూట్లోనే వెళుతున్నాయట.