
లింగాల, వెలుగు: ఉడుములు తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో ఈశ్వర్ తెలిపారు. మండలంలోని పద్మానపల్లి గ్రామానికి చెందిన కాట్రాజు రాజు, కాట్రాజు నిరంజన్, రాయ బాలయ్య, బల్మూరి లింగస్వామి గురువారం సాయంత్రం దారారం సమీపంలోని అడవిలో కుక్కలతో సంచరిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. 9 ఉడుములు ఉన్నట్లు గుర్తించామని, వాటిలో 3 చనిపోగా, మిగిలిన 6 ఉడుములను బేస్ క్యాంప్ వద్ద ఉంచి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. నలుగురిపై వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వన్యప్రాణులను పట్టుకున్నా, అమ్మినా, తిన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్ఆర్వో ఖాదర్ పాషా, డీఆర్వో జయదేవ్, శివాజీ ఉన్నారు.