విధులకు హాజరుకానివ్వడంలేదు.. జీతం ఆపేశారు

విధులకు హాజరుకానివ్వడంలేదు.. జీతం ఆపేశారు
  • కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళా టీచర్ పిల్లలు
  • కేసు నమోదు చేసిన నంద్యాల త్రీటౌన్ పోలీసులు

కర్నూలు: ఓ మహిళా టీచర్ పట్ల ఎయిడెడ్ విద్యా సంస్థ యాజమాన్యం, విద్యాధికారులు కుమ్ముక్కయి తీవ్రంగా వేధిస్తున్నారు. తనకంటే జూనియర్ ను తీసుకొచ్చి తనపై అజమాయిషీ చెలాయించే హెడ్మాస్టర్ బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని ప్రశ్నిస్తే నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ మరింత దారుణంగా వ్యవహరిస్తున్న వైనం ఇది. తొలుత యాజమాన్యాన్నే ప్రశ్నించగా.. వారు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో విద్యాధికారులకు ఫిర్యాదు చేయగా.. విచారిస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. దీన్ని సహించలేక స్వయంగా కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిని కలసి ఫిర్యాదు చేయగా విచారణ చేసినా.. న్యాయం జరగలేదు. పైగా వేధింపులు మరింత తీవ్రం కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసు కేసు వెనక్కు తీసుకోమంటూ మరింత తీవ్రంగా వేధించడంతో బాధితురాలి పిల్లలు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ను కలసి ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం.. క్షేత్ర స్థాయిలో కొందరి నియంతృత్వానికి నిదర్శనంలా నిలిచిన ఈ ఉదంతం విద్యాశాఖ లోనే కాదు.. ఉద్యోగ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
MEOతోపాటు నంద్యాల SPG స్కూల్  డయాసిస్ బిషప్, డయాసిస్ సెక్రటరీపై కేసు
నంద్యాల ఎస్పీజీ ఎయిడెడ్ మోడల్ ప్రైమరీ స్కూల్ లో పనిచేయుచున్న ఎస్జీటీ టీచర్ MFA విజయరాణిని విధులకు హాజరుకానివ్వకుండా అడ్డుకుంటుండడమే కాదు.. కక్ష కట్టి రెండు నెలలుగా జీతాలు ఆపేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులపై సమాచార హక్కు చట్టం కింద సాక్షాధారాలు సమర్పించడంతో నంద్యాల త్రీటౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. విజయరాణి అనే టీచర్ కు అకారణంగా మే నెల, జూన్ నెల జీతాలు మంజూరు చేయకుండా వేధిస్తున్న నంద్యాల ఎంఇఓ బ్రహ్మం పై IPC - 188 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అలాగే పాఠశాల విధులకు హాజరు కానివ్వకుండా అడ్డుకున్న కెనడి, అందుకు సూత్రధారులైన నంద్యాల SPG డయాసిస్ బిషప్, డయాసిస్ సెక్రటరీ లపై IPC- 341, 355 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. 

న్యాయం చేయమంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన టీచర్ విజయరాణి పిల్లలు 
తమ తల్లిని స్కూల్ లోనికి రానివ్వకుండా అడ్డుకుంటూ.. రెండు నెలలుగా జీతాలు చేయకుండా వేధిస్తూ అవమానిస్తున్నారని విజయరాణి టీచర్ పిల్లలు బెన్హర్, దివ్యస్నేహిత సోమవారం కర్నూలు కలెక్టర్ జి.వీరపాండియన్ ను కలసి ఫిర్యాదు చేశారు. జీతాలు లేకుంటే మా ఫీజులు, జీవనం ఎలా కొనసాగించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. యాజమాన్యంతోపాటు విద్యాశాఖ అధికారుల వేధింపుల వల్ల తమ తల్లిదండ్రులకు ఏదైనా జరగరానివి జరిగితే దానికి బాధ్యులను చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
టార్గెట్ చేసి పదేపదే వేధిస్తున్నారు: బీటీఎఫ్ సతీష్ కుమార్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు.. ప్రభుత్వం ఒకవైపు వేల కోట్లు ఖర్చు చేస్తూ.. మరో వైపు స్కూళ్ల స్వరూపాలను పూర్తిగా మార్చి వేసేందుకు కృషి చేస్తుంటే సాక్షాత్తు విద్యాశాఖ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ సైనికోద్యోగి, బీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ ఆరోపించారు. 2018 లో చేపట్టిన పదోన్నతుల్లో పదోన్నతి మరియు స్థానం కేటాయించడం లో ఆర్జేడీ కడప, డీఈఓ, కర్నూలు, మేనేజ్మెంట్ బిషప్ కలిసి మోసం అన్యాయం చేశారని, మరల ఎస్పీజీ ఎయిడెడ్ మోడల్ ప్రైమరీ స్కూల్ లో 01.05.2021న హెచ్.ఎం గా విధులు అప్పగించి స్కూల్ లోనికి రానివ్వకుండా స్కూల్ కు తాళాలు వేసి విధులను అడ్డుకుని అవమానించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో డీఈఓ, కర్నూలు, వారికి పిర్యాదు చేయగా ఏకంగా అకారణంగా జీతాలు నిలిపివేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి పక్షాన ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం కొనసాగిస్తామని.. ఇగోలకు వెళ్లి అన్యాయం తలపెట్టడం సంస్కార వంతుల లక్షణం కాదని ఆయన హితవు పలికారు.