
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఒక్క రోజులోనే 1000 కంటే ఎక్కువ కేసులతో నమోదవడంతో ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,071కి పైగా తాజా కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 76 నమూనాల్లో XBB 1.16 వేరియంట్‌ను వైద్యులు గుర్తించారు. దేశంలో కొవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణంగా భావిస్తున్నారు. అయితే XBB 1.16 వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఓ వైపు XBB 1.16 వేరియంట్ కేసులు..మరో వైపు హెచ్3ఎన్2 వైరస్ కేసులతో దేశంలో పరిస్థితి క్లిష్టంగా మారింది. ప్రజలు ఇప్పటికే ఇన్ ఫ్లొయేంజా బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గి కోవిడ్ సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశాలు నిపుణులు చెబుతున్నారు. XBB 1.16 వేరియంట్, ఇన్ ఫ్లూయెంజా కేసుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.
కోవిడ్ , H3N2 వైరస్ సాధారణ లక్షణాలు
ఈ రెండు వైరస్‌లు వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటి లక్షణాలు సాధారణంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రెండు వైరస్ సోకితే అలసట,దగ్గు,తలనొప్పి, గొంతులో మంట ఏర్పడతాయని వెల్లడించారు. ఇన్‌ఫ్లుఎంజా, కోవిడ్ మధ్య వ్యత్యాసం పరీక్ష తర్వాత మాత్రమే కనిపెట్టగలమని వైద్యులు తెలిపారు. అయితే H3N2 వైరస్ సోకిన వ్యక్తులు అధిక జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో ఇబ్బందులు పడతాయన్నారు. అటు కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు గొంతు నొప్పి, దగ్గు,జలుబు వంటి లక్షణాలు కలిగి ఉంటారని తెలిపారు.
ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు..
ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కేసులో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పుదుచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. XBB 1.16 వేరియంట్ తొలిసారిగా జనవరిలో గుర్తించారు. ఫిబ్రవరిలో 59 నమూనాల్లో ఈ వేరియంట్‌ను కనుగొన్నారు. మార్చిలో ఇప్పటి వరకు XBB 1.16 వేరియంట్ 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని నిపుణులు భావిస్తున్నారు.