రెండో పెళ్లి చేసుకుందని రూ. లక్ష జరిమానా

రెండో పెళ్లి చేసుకుందని రూ. లక్ష జరిమానా

   
ముంబై: ఆమెకు పెండ్లి అయింది. కొన్ని కారణాల వల్ల భర్త నుంచి డైవర్స్​ తీసుకుని రెండో వివాహం చేసుకుంది. అది కుల పెద్దలకు నచ్చలేదు. పంచాయితీ పెట్టారు. బాధితురాలి బంధువులను పిలిపించి ఆమె తమ ఉమ్మును నాకాలని తీర్పు చెప్పారు. అంతేకాకుండా రూ.లక్ష జరిమానా చెల్లించాలన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లా వాడ్గావ్ ​గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏప్రిల్ ​9న జరిగిన ఈ ఘటనపై బాధితురాలు కుల పెద్దలపై గురువారం పోలీసులకు కంప్లయింట్​చేయడంతో విషయం బయటకు తెలిసింది. పోలీసులు వివరాల ప్రకారం, నాత్​జోగి కమ్యూనిటీకి చెందిన ఓ మహిళ 2011లో మొదటి పెండ్లి చేసుకోగా, 2015లో భర్త నుంచి డైవర్స్​ తీసుకుంది. ఆ తర్వాత 2019లో రెండో పెండ్లి చేసుకుంది. ఈ విషయంపై కుల పంచాయతీ పెద్దలు.. ఆమె సోదరి, బంధువులను పిలిపించి కుల పంచాయతీ సభ్యులు అరటి ఆకులపై ఉమ్మి వేస్తారని, ఆ ఉమ్మును బాధితురాలు నాకాలని తీర్పు ఇచ్చారు. అలాగే లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని చెప్పారు. లేకపోతే కులం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని బంధువులు బాధితురాలికి చెప్పడంతో షాక్​కు గురైన ఆమె చోప్డా నగర పోలీస్​ స్టేషన్​లో పంచాయతీ సభ్యులపై కంప్లయింట్​ చేసింది.