
- రెస్య్కూ చేసి కాపాడిన ఆఫీసర్లు
మహమ్మద్ నగర్(ఎల్లారెడ్డి), వెలుగు: బ్యారేజీ అధికారుల నిర్లక్ష్యంతో మంజీరా నదిలో పశువుల కాపారులు, పశువులు, మేకలు చిక్కుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మంజీరా బ్యారేజీ, నిజాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా నీటిని వదిలారు. అదే సమయంలో మహ్మద్ నగర్ మండలం మగ్దంపూర్ గ్రామం సమీపంలో మంజీరా నది పరిసరాల్లో మేకలు, పశువులు మేపడానికి కాపరులు వచ్చారు.
నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో గ్రామానికి చెందిన అజఘర్ పాషా, గంగారాంతో పాటు 40 మేకలు, 5 పశువులు మంజీరా నదిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వరద గేట్లను మూసివేశారు. అనంతరం పశువుల కాపరులను రెస్క్యూ సిబ్బంది సాయంతో కాపాడారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ తిరుపతయ్య, మహ్మద్ నగర్ తహసీల్దార్ సవాయ్ సింగ్, నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పాల్గొన్నారు.