లిక్కర్ స్కామ్​ కేసు.. UP DATE

లిక్కర్ స్కామ్​ కేసు.. UP DATE

ఢిల్లీ లిక్కర్​ స్కాం: సీబీఐ నోటీసులకు కవిత ప్రతిస్పందన

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో వివరణ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. తన వివరణ తీసుకోవాలని భావిస్తున్నామని పేర్కొంటూ శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసును సీబీఐ ఇష్యూ చేసింది. దానికి కవిత స్పందిస్తూ.. సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి ఇవాళ లేఖ రాశారు.  సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కవిత కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.

6న ఢిల్లీ లేదా హైదరాబాద్​లో విచారణకు హాజరుకావాలని కోరిన దర్యాప్తు సంస్థ 
హైదరాబాద్​లోని తన నివాసంలో హాజరవుతానన్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈనెల 2వ తేదీన (శుక్రవారం) సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షహీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో పాటు మరో14 మందిపై ఐపీసీ సెక్షన్ 477‌‌ఏ కేసు నమోదైందని సీబీఐ వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. తదుపరి దర్యాప్తులో సాక్ష్యాధారాలపై విచారణ అవసరంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అందువల్ల ఈ నెల 6వ తేదీన (మంగళవారం) ఉదయం 11 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్​లో ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని నోటిసుల్లో పేర్కొంది. 

నోటీసులపై స్పందించిన కవిత

సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు నోటీసులు అందినట్లు వెల్లడించారు. హైదరాబాద్​లో తన నివాసంలోనే ఈనెల 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతానని రిప్లయ్​ ఇచ్చినట్లు ఒక ప్రకటనలో ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ప్రస్తావన

ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో సీబీఐ, ఎన్ ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు ఆరుగురిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్, తర్వాత ఆప్  పార్టీకి చెందిన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అమిత్ అరోరాను హాజరుపరిచిన సందర్భంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును కూడా ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని, సౌత్​గ్రూప్​ను 

అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి(ఆంధ్రప్రదేశ్) నియంత్రించారని తెలిపింది. సౌత్​ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను ఆప్ నేత విజయ్ నాయర్​కు ఇచ్చినట్లు వెల్లడించింది. అమిత్ అరోరా తన స్టేట్​మెంట్లో ఈ విషయం ధ్రువీకరించారని రిమాండ్ రిపోర్ట్  ఈడీ పేర్కొంది. 

వీరిలో తెలంగాణకు చెందిన రాబిన్ డిస్టీలర్స్ లో డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిలను దర్యాప్తు సంస్థలు(సీబీఐ, ఈడీ) ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తీహార్ జైల్లో రిమాండ్​లో ఉన్నారు. సౌత్ గ్రూప్ లో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదనలు కూడా వినిపించింది. అలాగే.. బోయినపల్లి అభిషేక్ సౌత్ గ్రూప్ కు రూ.100 కోట్లను చేర్చడంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. అమిత్​అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంపై సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. 


ఫోన్ల రికవరీపై ఈడీ ఫోకస్..
కీలకంగా అరోరా రిమాండ్‌‌ రిపోర్ట్‌‌
స్కాంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ఏడుగురు
43ఫోన్లలో 8 సిమ్‌‌కార్డులు వాడినట్లు గుర్తింపు
కీలకంగా అరోరా రిమాండ్‌‌ రిపోర్ట్‌‌


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరక్టరేట్‌‌‌‌(ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్​లో 36 మంది నేరపూరిత కుట్రకు పాల్పడ్డట్లు ఆప్  పార్టీకి చెందిన అమిత్ అరోరా రిమాండ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లో ఈడీ వెల్లడించింది. లిక్కర్‌‌ పాలసీ మార్పులో సౌత్‌‌‌‌ గ్రూప్‌‌‌‌(సౌత్ లిక్కర్​లాబీ) నుంచి రూ.100 కోట్లు చేతులు మారినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా 170 ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. ఇందులో 17 ఫోన్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. మిగతా 153 ఫోన్లను ఏం చేశారనే వివరాలు రాబడుతోంది. ఇందులో భాగంగానే అమిత్ అరోరా రిమాండ్‌‌‌రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్న వారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బోయినపల్లి అభిషేక్‌‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌‌శరత్‌‌‌‌చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్‌‌‌‌ చేసింది.

లీగల్ ప్రొసీజర్‌‌‌‌తో ముందుకెళ్తున్న ఈడీ

అమిత్‌‌‌అరోరా వెల్లడించిన వివరాలతో రాష్ట్రానికి చెందిన ఏడుగురి వివరాలు తెలిశాయి. ఇందుకు సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ పూర్తి చేసినట్లు తెలిసింది. ఇందులో ఇప్పటికే బోయినపల్లి అభిషేక్, శరత్​చంద్రారెడ్డిని అరెస్టు చేసి విచారించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా ఐదుగురికి కూడా వారం రోజుల వ్యవధిలో షెడ్యూల్ ప్రకారం నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. వీరిని ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇండో స్పిరిట్‌కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు, ఢిల్లీకి చెందిన విజయ్‌‌‌నాయర్‌ ద్వారా ప్రభుత్వ అధికారులకు లంచం అందినట్లు ఆధారాలు సేకరించింది. స్కామ్‌‌‌‌లో నిందితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్ ఆధారంగా సౌత్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ లింకులు బయటకు లాగింది. లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మీటింగ్స్ వివరాలను సేకరించింది.

ఫోన్లు, వాట్సాప్ డేటా సేకరణ

ఫోన్‌‌‌‌ నంబర్స్ సీడీఆర్, ఐఎంఈఐ నంబర్స్‌‌‌‌తో ప్రశ్నించనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ఏడుగురు గత ఏడాదిసెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీ వరకు మొత్తం 43 ఫోన్లను, 8 సిమ్​లను మార్చినట్లు గుర్తించింది. ఈ ఫోన్లను ఏం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. పాలసీ మార్పు కోసం డిస్కషన్ జరిగిన తేదీలు, మొబైల్‌‌‌‌ ఫోన్లను మార్చిన తేదీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. ఇందుకోసం ఐటీ రంగ నిపుణలతో డాటా కలెక్ట్ చేస్తున్నది. మొబైల్‌‌‌సర్వీసెస్‌‌‌సర్వర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డేటాను ఇప్పటికే రిట్రీవ్‌‌‌‌ చేసినట్లు సమాచారం. ఇందులో ఫైనల్‌‌ పాలసీ ఫార్ములాను వాట్సాప్‌‌‌‌లో షేర్ చేసుకున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. లిక్కర్‌‌స్కామ్ వెలుగులోకి వచ్చిన తరువాత ఆగస్ట్‌‌‌17న సీబీఐ కేసు రిజిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

ధ్వంసం చేసిన ఫోన్లు ఎక్కడ..?

సౌత్‌‌ గ్రూప్‌‌‌‌ నుంచి రూ.100 కోట్లు సేకరించేందుకు జరిగిన మీటింగ్స్ లొకేషన్స్‌‌‌‌ను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌లు సాక్షుల స్టేట్‌‌‌‌మెంట్ రికార్డ్‌‌‌‌ చేసినట్లు తెలిసింది. షెల్‌‌‌‌ కంపెనీల ద్వారా డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌అయ్యాయని ఈడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే బోయినపల్లి అభిషేక్, ఎమ్మెల్సీ కవిత, శరత్‌‌‌‌చంద్రారెడ్డి పేర్లను అమిత్‌‌‌అరోరా ప్రస్తావించినట్లు ఈడీ రిమాండ్‌‌రిపోర్ట్‌‌‌‌లో వెల్లడించింది. ఆధారాలు లభించకుండా ఫోన్లను ధ్వంసం చేయడం లేదా మార్చారని వివరించింది. ఈ విచారణతో 153 ఫోన్లు ఏం చేశారు..? అనే వివరాలు రాబట్టనుంది. రికవరీ చేసిన ఫోన్స్ ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టనుంది.

***********************

లిక్కర్ స్కామ్ లో కవిత

లిక్కర్​ స్కామ్ : అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో కవిత పేరు
ఆధారాలు దొరక్కుండా 11 నెలల్లో 10 ఫోన్లు, రెండు సిమ్​లు మార్చారు, ధ్వంసం చేశారు
అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో ఈడీ వెల్లడి
అరబిందో శరత్ ​చంద్రారెడ్డి, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు కూడా ప్రస్తావన
సౌత్​ గ్రూప్​ నుంచి విజయ్​ నాయర్​కు 100 కోట్లు
153 ఫోన్లు ధ్వంసం చేసిన 36 మంది నిందితులు.. వాటి విలువ రూ. కోటీ 38 లక్షలు
ఆ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లతో సహా రిపోర్టు
32 పేజీల నివేదికలో పలు కీలక అంశాలు
అరోరాను 7 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చిన కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లిక్కర్​ వ్యాపారి అమిత్​ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ)  చేర్చింది. ఆమెతోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్​ శరత్​చంద్రారెడ్డి, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా మొత్తం 36 మంది పేర్లను యాడ్​ చేసింది. లిక్కర్​ స్కామ్​లో కీలక నిందితుడు విజయ్​ నాయర్​కు సౌత్​ గ్రూప్​ (దక్షిణాది) నుంచి రూ. 100 కోట్లు అందాయని, ఈ గ్రూప్​ను కవిత, శరత్​చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి లీడ్​ చేశారని వెల్లడించింది.

ఆధారాలు దొరక్కుండా 10 మొబైల్ ఫోన్స్​ను కవిత డ్యామేజ్ చేయడం, మార్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని, ఇందులో 6209999999 ఫోన్​ నంబర్​తో మాట్లాడినప్పుడు ఆరు ఫోన్లు, 8985699999 ఫోన్​ నంబర్​తో నాలుగు ఫోన్లు మార్చినట్లు, ధ్వంసం చేసినట్లు ఈడీ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్​ 1 నుంచి ఈ నెల ఆగస్టు వరకు ఈ చర్యలకు పాల్పడ్డట్లు రిపోర్టులో వివరించింది. స్కామ్​తో సంబంధం ఉన్న 36 మంది నిందితులు/అనుమానితులు 170 ఫోన్లను మార్చారని, తాము కేవలం 17 ఫోన్లను రికవరీ చేయగలిగామని తెలిపింది. మిగతా ఫోన్లను ఆధారాలు దొరకకుండా నిందితులు ధ్వంసం చేశారని, అవి దొరికి ఉంటే ముడుపుల లెక్క ఇంకా ఎక్కువగా ఉండేదని ప్రధానంగా ప్రస్తావించింది. ధ్వంసమైన 153 ఫోన్ల విలువ కోటీ 38 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. 

అమిత్​ ఆరోరా ఒప్పుకున్నడు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా అనుచరుడు అమిత్ అరోరాను మంగళవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్  ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా దాదాపు 32 పేజీల రిమాండ్ రిపోర్టు ను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్(ఐఓ) జోగేందర్ దాఖలు చేశారు. ఈ రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను పొందుపరిచారు. రూ.100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెల్లించిందని, సౌత్ గ్రూప్​ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది.  సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను ఢిల్లీకి చెందిన ఆప్​ లీడర్​ విజయ్ నాయర్​కు చేరినట్లు తెలిపింది. వీటిన్నింటినీ దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ఒప్పుకున్నారని ఈడీ వెల్లడించింది. 

ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా లిక్కర్​ పాలసీ

ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా లిక్కర్​ పాలసీని రూపొందించడంలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. మొత్తం మూడు లెవల్స్ లో కిక్ బ్యాగ్ మనీని ఆప్ లీడర్లు పొందినట్లు చూపింది. మ్యానిఫెక్షర్,  ఎల్ 1 డిస్ట్రీబ్యూటర్, డ్రిస్ట్రిబ్యూటర్ ఎంపిక అంశంలో లూప్ హోల్ ఉన్నట్లు గుర్తించింది. విజయ్ నాయర్, దినేశ్​ అరోరాతో కలిసి ఈ కుట్రలో పాలుపంచుకున్నట్లు పేర్కొంది. ఈ కేసులో దినేశ్​ అరోరా ఇప్పటికే అప్రూవర్​గా మారాడు. లిక్కర్​ స్కాంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 12 శాతం ఆదాయం అంటే రూ. 581 కోట్లు నష్టపోయిందని ఈడీ తెలిపింది. అలాగే దేశీ, విదేశీ లిక్కర్ల విషయంలో అమ్మకందారులకు సంబంధించి రూపొందించిన రేట్లు, ఫ్రాఫిట్, వ్యాట్, ప్రర్సెంటేజ్, ఇతర అంశాలను కూడా టేబుల్స్​ రూపంలో  ఈడీ తన రిపోర్టులో వెల్లడించింది. మొత్తం 13 మేజర్ మ్యానిఫాక్షర్ కంపెనీలు, 14 హోల్ సేల్ ఎల్ షాపులు, 32 రిటైల్స్ జోన్స్ ల సమాచారాన్ని కంపెనీల పేర్లతో సహా ప్రస్తావించింది. ఇందులో చాలా కంపెనీలను ఇన్వెస్టిగేషన్ చేసినట్లు తెలిపింది.  ఇందులో శరత్ చంద్రారెడ్డికి సంబంధించి శ్రీ అవంతిక కన్ట్సక్టర్ లిమిటెడ్, ట్రిడెంట్ చెంఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఈకో ప్రైవేట్ లిమిటెడ్ లు గా గుర్తించింది. అలాగే, లిక్కర్ కేసులో తొలుత అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, రాఘవ్ మాగుంట, అమిత్ అరోరాకు సంబంధించిన కంపెనీ పేర్లనూ పేర్కొంది. మొత్తం 32 రిటైల్స్, ఎల్ 7 జోన్స్ కు సంబంధించి రెండు ఫేజుల్లో ఢిల్లీ ఎక్సైజ్​ పాలసీకి ఆక్షన్ వేశారని, ఇందులో 20 జోన్లు ఫస్ట్ రౌండ్ లో, 12 జోన్స్ సెకండ్ రౌండ్ లో ఆక్షన్ వేశారని తెలిపింది.  2021-–-2022  ఏడాదికిగాను లైసెన్స్ ఫీజు రూ. 7,025 కోట్లు, బిడ్ అమౌంట్ రూ. 8,911 కోట్లు నిర్ధారించారని, ఇందులో లైసెన్స్ కు సంబంధించిన మొత్తం 9 విభాగాల్లో  రూ. 2, 873 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ తన రిపోర్టులో పేర్కొంది.

ఒకే రోజు ఫోన్లు మార్చారు

కవిత, బోయినపల్లి అభిషేక్​రావు, సీఏ బుచ్చిబాబు గత ఏడాది సెప్టెంబర్​ 1న ఒకే రోజు ముగ్గురు ఫోన్లు మార్చినట్లు ఈడీ గుర్తించింది. తర్వాత అదే నెల 24న అభిషేక్, బుచ్చిబాబు ఫోన్లు మారినట్లు వెల్లడించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్​ 30న మరోసారి అభిషేక్ ఫోన్ మార్చితే.. ఆ మార్నాడు 31న కవిత ఫోన్ చేంజ్ చేశారని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 19న అభిషేక్ మొబైల్ మార్చితే.. ఆగస్టు 20న బుచ్చిబాబు, రెండు రోజులు తర్వాత 22న కవిత వేరే ఫోన్ యూజ్ చేశారని వివరించింది. మళ్లీ మర్నాడు  23న కవిత రెండు ఫోన్లు మార్చారని తెలిపింది.

రూల్స్​కు విరుద్ధంగా లిక్కర్​ పాలసీ: ఈడీ
 

* ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును ఈడీ కీలకంగా ప్రస్తావించింది. 

* ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారీలో కీలకంగా ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. నిపుణుల కమిటీ రిపోర్ట్, పబ్లిక్ సూచనలకు విరుద్ధంగా జీవోఎం పాలసీని రెడీ చేసింది. జీవోఎం రిపోర్ట్ పై ఎలాంటిస్పందనలు తీసుకోలేదు. పాలసీ ఫైనలైన 3 నెలల తర్వాతే పబ్లిక్ డొమైన్ లో పెట్టారు.

* హోల్ సేల్ వ్యాపారాన్ని తయారీ నుంచి వేరు చేసి పూర్తిగా ప్రైవేటుకే ఇచ్చేలా పాలసీని జీవోఎం మార్చింది.

* ప్రాఫిట్ మార్జిన్ పాత పాలసీలో 5 శాతం ఉంది. దీన్ని ఏకంగా 12 శాతానికి పెంచారు. ఇంత భారీగా పెంచడానికి అర్థంలేని కారణాలు చూపించారు. ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్ నామమాత్రంగా మారింది. అసలు అమలుకాలేదు. ఇంత భారీ మార్జిన్ పెంచాలని ఎక్స్ పర్ట్ గానీ, పబ్లిక్ గానీ, స్టేక్ హోల్డర్స్ కూడా ఎవరూ అడగలేదు.

* కొన్ని నిర్ధారించని ప్రాంతాల్లో షాపులు తీయలేమన్న పేరుతో లైసెన్స్ పొందినవారి ఫీజును తగ్గించారు. కానీ గత మూడేళ్ల కంటే ఈ పాలసీ కాలంలో సేల్స్ భారీగా పెరిగాయి. కొన్ని షాపులు తీయలేకపోవడం వల్ల వారికి ఎలాంటి నష్టం కలగలేదు. కానీ లైసెన్స్ ఫీజు తగ్గించడం వల్ల వ్యాపారులకు 719 కోట్ల అనవసర లాభం కలిగించారు. ఈ మేరకు ఖజానాకు నష్టం జరిగింది.

* లైసెన్స్ ఫీజుల తగ్గించడం, పలు ఇతర మినహాయింపుల కారణంగా 2,873 కోట్ల నష్టం జరిగింది.


14 ఫోన్లు, 4 నంబర్లు మార్చిన సిసోడియా

లిక్కర్ స్కాంలో పెద్ద మొత్తంలో డిజిటల్ ఎవిడెన్స్​ను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో దేశవ్యాప్తంగా 178 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అనేక ఆధారాలను సేకరించింది. 36 మంది  దాదాపు రూ.1.38 కోట్ల విలువ చేసే 170 ఫోన్లు మొబైల్ ఫోన్స్ ను పగలగొట్టడం, మార్చడం ద్వారా ఎవిడెన్స్ ను మాయం చేశారని గుర్తించింది. 17 ఫోన్లను మాత్రమే తాము స్వాధీనం చేసుకోగలిగామని తెలిపింది. ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ రిపోర్టులో పేర్కొంది. ఈ స్కామ్​లో అత్యధికంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా మొత్తం 4 నంబర్లు ఉపయోగించారని పేర్కొంది. అందుకు కోసం 14 ఫోన్లను మార్చి ఎవిడెన్స్ ను నాశనం చేశారని రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీకి చెందిన మరో మంత్రి కైలాష్ గెహ్లాట్ ఒక నెంబర్, మూడు ఫోన్లు.. సన్నీ మార్వా ఒక నంబర్, 7 మొబైల్స్.. విజయ్ నాయర్ రెండు నంబర్లు, 6 ఫోన్లు.. సమీర్ మహేంద్రు ఒక నంబర్, 4 ఫోన్లు.. అమిత్ అరోరా 4 నంబర్లు, 11 ఫోన్లు.. అరుణ్ పిళ్లై ఒక నంబర్, 5 ఫోన్లు వాడినట్లు పేర్కొంది. అలాగే, సౌత్ గ్రూప్స్ కు సంబంధించి శరత్ చంద్రారెడ్డి ఒక నంబర్, 9 ఫోన్లు.. కవిత రెండు నంబర్లు, 10 మొబైల్స్.. బోయినపల్లి అభిషేక్ రావు  ఒక నంబర్, 5 ఫోన్లు వాడినట్లు ఈడీ స్పష్టం చేసింది. 

విజయ్ నాయర్ స్టేట్ మెంట్ ఆధారంగా..

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 ప్రకారం విజయ్ నాయర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం.. విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీలో సామాన్య కార్యకర్త కాదని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు దగ్గరి అనుచరుడని ఈడీ పేర్కొంది. విజయ్ నాయర్ కు ఢిల్లీలో రెసిడెన్సీ లేదని, 2020 నుంచి ప్రభుత్వం రాష్ట్ర మంత్రి కైలాశ్ గెహ్లాట్ కు కేటాయించిన నివాసంలో ఉంటున్నారని తెలిపింది. అయితే.. మంత్రి మాత్రం నజాఫ్ ఘర్ లోని ప్రైవేటు ఇంట్లో ఉంటున్నారని స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ 4న ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియా నేతృత్వంలోని కమిటీ ఈ లిక్కర్ పాలసీని రూపొందించినట్లు వెల్లడించింది. ఇందులో సిసోడియాతో పాటు మంత్రులు సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్ ఉన్నట్లు తెలిపింది. 

***********************

కేసీఆర్​ బీఆర్‌‌ఎస్‌‌ ప్రకటన బీజేపీని గడగడలాడించింది : ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్‌‌ స్కాంలో ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలడిగితే తప్పకుండా జవాబు చెప్తామని, కానీ మీడియాకు లీకులిచ్చి నాయకుల మంచి పేరు చెడగొట్టాలని చూస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘‘కాదు.. కూడదు.. జైల్లో పెడ్తమంటే.. పెట్టుకో. ఏమైతది..? భయపడేదేముంది..? ఎక్కువలెక్కువ ఏం చేస్తరు.. ఉరెక్కిస్తరా? ఎక్కువలెక్కువంటే జైల్లో పెడ్తరు.. అంతేకదా.. పెట్టుకోండి..? ఏమైతది..” అని ప్రశ్నించారు. 

గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిదేండ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టారని, అడ్డదారుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని కవిత ఆరోపించారు. ‘‘ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చేకన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్​లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది. ఇది నార్మల్​. నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావొచ్చు.. ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ. ఇందులో ఏం లేదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని అన్నారు.

తాము ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామని, ప్రజల అండ ఉన్నంత కాలం ఎవరికీ ఏమీ ఇబ్బందిరాదని చెప్పారు. ‘‘ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి రావాలే తప్ప.. ఈడీ, సీబీఐని ప్రయోగించి గెలవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సాధ్యపడదు” అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అక్రమ మార్గాల్లో కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా సాగుతున్నదని, అలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ కుట్రను బట్టబయలు చేసినందుకే తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారని కవిత మండిపడ్డారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. 

కేసీఆర్​  ప్రకటన బీజేపీని గడగడలాడించింది 

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌గా మార్చుతున్నట్టు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రకటన బీజేపీని గడగడలాడించిందని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటును జీర్ణించుకోలేక చవకబారు రాజకీయాలకు తెరతీసిందని కవిత ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసినందుకే కక్షసాధింపులకు దిగుతున్నదని ఆరోపించారు. విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సైన్యం ముందు పనిచేయవని పేర్కొన్నారు. విచ్ఛిన్నకర, కుటిల రాజకీయాలను పాతర పెట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలదని ఆమె తెలిపారు.

***********************

7 రోజుల కస్టడీకి అమిత్ అరోరా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరాను సీబీఐ స్పెషల్ కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.  ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ అధికారులు బుధవారం అమిత్ అరోరాను అదుపులోకి తీసుకొని.. తర్వాత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్ ముందు హాజరుపరిచారు. తొలుత ఈడీ తరఫు అడ్వకేట్ నవీన్ కుమార్ మిట్ట వాదనలు వినిపిస్తూ... అమిత్ అరోరాను 14 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. కిక్‌‌ బ్యాక్ పాత్రలో అమిత్ అరోరా కీ రోల్ పోషించినట్లు తెలిపారు. అమిత్ అరోరా రూ.2.5 కోట్ల లంచం వసూలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈడీ అడ్వకేట్ వాదనలపై అరోరా తరఫు లాయర్​అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే 22 సార్లు అరోరా ఈడీ ముందు హాజరయ్యారని, ఫోన్ కాల్​విచారణకు సహకరించారని తెలిపారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న జడ్జి నాగ్​పాల్... 22 సార్లు విచారణల తర్వాత కస్టడీ అవసరమేంటనీ ఈడీని ప్రశ్నించారు. కేవలం మూడుసార్లు వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈడీ తరఫు అడ్వకేట్​ కోర్టుకు తెలపగా, ఈడీ ఫోన్ చేసి పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరయ్యారని అరోరా తరఫు లాయర్​ చెప్పారు. తన క్లయింట్ ఫోన్ కూడా మార్చలేదని తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు.. అమిత్ అరోరాను డిసెంబర్ 7 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది.

***********************