
పది ఫోన్లు ఎందుకు మార్చారు?
లిక్కర్ స్కామ్‌లో కవితను ప్రశ్నించిన సీబీఐ
ఆమె ఇంట్లోనే 7 గంటలపాటు కొనసాగిన విచారణ
నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం
లిక్కర్ పాలసీ మీటింగ్స్, ట్రావెల్ హిస్టరీపై ఆరా!
కవిత స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఆఫీసర్లు
విచారణ తర్వాత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కవిత
ఆయన సూచనతో ప్రగతి భవన్‌కు పయనం
డాక్యుమెంట్ల కోసం మళ్లీ సీబీఐ నోటీసులు
హైదరాబాద్, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ఏడు గంటలకుపైగా విచారించారు. నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా 11 నెలల వ్యవధిలో 10 ఫోన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించినట్లు తెలిసింది. సౌత్ గ్రూపును ఎవరెవరు ఎలా ఆపరేట్ చేశారనే దానిపై తమ వద్ద ఉన్న వివరాలతో ఆమెను విచారించినట్లు సమాచారం. వివిధ సందర్భాల్లో జరిగిన పార్టీలు, వాటిలో పాల్గొన్న వ్యక్తుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరికొందరిపై నమోదు చేసిన కేసులో కవితకు 160 సీఆర్పీసీ కింద ఈ నెల 2న నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లో సుదీర్ఘంగా విచారించారు.
ఉదయం 10.50 గంటలకు రెండు వాహనాల్లో అక్కడికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఆరు గురు అధికారులతో కూడిన ఈ టీమ్‌లో ఒక మహిళా అధికారి ఉన్నారు. ఉదయం 11 గంట లకు విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. సీబీఐ అధికారుల కోసం కవిత తన ఇంటి సమీపంలోని ఒక రెస్టారెంట్ నుంచి లంచ్ తెప్పించగా అధికారులు దాన్ని వెనక్కి పంపారు. హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీస్ నుంచి తెప్పించిన లంచ్ చేసి విచా రణ చేపట్టారు. లంచ్‌కు ముందు అడ్వకేట్ సమక్షం లో కవితను ప్రశ్నించిన అధికారులు.. ఆ తర్వాత అడ్వకేట్‌ను బయటకు పంపి కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. కవిత ఇచ్చిన సమాధానాలను డ్రాఫ్ట్ చేసి చదివి వినిపించారు. మహిళ కావడంతో ప్రొసీజర్ ప్రకారం సాయంత్రం 6 గంటల్లోపు విచా రణ ముగించారు. ఆ తర్వాత అరగంట పాటు లీగ ల్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు.
కుటుంబ సభ్యులను తప్ప ఎవరినీ అనుమతించలే
విచారణ సందర్భంగా కుటుంబ సభ్యులను తప్ప కవిత వ్యక్తిగత సిబ్బందితో పాటు ఎవరినీ ఇం ట్లోకి సీబీఐ ఆఫీసర్లు అనుమతించ లేదు. ఆమె ఇంటికీ ఇరువైపులా బారికేడ్లు పెట్టి మీడియా సహా ఇంకెవరూ ఇంటివైపు వెళ్లకుండా కట్టడి చేశా రు. బీఆర్‌ఎస్ కార్యకర్తలెవరూ రావొద్దని కవిత ముందే చెప్పినా.. భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, క్రాంతి కిరణ్, కార్పొరేషన్ల చైర్పర్సన్లు మేడె రాజీవ్ సాగర్, కూర్మాచలం అనిల్, గజ్జెల నగేశ్, దూదిమెట్ల బాలరాజు, మంత్రి శ్రీదేవి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సహా పలువురు ముఖ్య నాయకులు, వందల సంఖ్యలో కార్యకర్తలు విచారణ సందర్భంగా కవిత ఇంటి సమీపంలోనే ఉన్నారు.
ఎవరెవరు ఎలా ఆపరేట్ చేశారు?
విచారణను సీబీఐ అధికారులు వీడియో రికార్డింగ్ చేసినట్టు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులోని వివరాలపై ప్రధానంగా కవితను ప్రశ్నించినట్టు సమాచారం. కేవలం 11 నెలల వ్యవధిలోనే పది ఫోన్లను ఎందుకు మార్చారని, సౌత్ గ్రూపును ఎవరెవరు ఎలా ఆపరేట్ చేశారనే దానిపై తమ వద్ద ఉన్న వివరాలతో ఆమెను ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విచారణకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించకున్నా విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. ఐఎంఈఐ నంబర్స్‌తో కనెక్ట్ అయిన ఫోన్స్, ఆయా నంబర్ల నుంచి వెళ్లిన అనుమానాస్పద కాల్స్ వివరాలను అడిగినట్లు సమాచారం. బోయినపల్లి అభిషేక్‌రావు సహా ఇతర నిందితుల కాల్స్ వివరాలతో ప్రశ్నించినట్లు తెలిసింది.
లిక్కర్ మీటింగ్స్, ట్రావెల్ హిస్టరీపై ప్రశ్నలు
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బోయినపల్లి అభిషేక్‌రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఈడీ కేసులో అరెస్ట్ అయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డితో ఎలాంటి పరిచయాలు ఉన్నాయనే వివరాలు కవితను సీబీఐ అధికారులు అడిగినట్లు తెలిసింది. ప్రధానంగా అభిషేక్‌రావు, రామచంద్ర పిళ్లైతో ఉన్న బిజినెస్ సహా ఇతర లావాదేవీల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ట్రా వెల్ హిస్టరీ ఆధారంగా గతేడాది నుంచి ఈ ఏడాది ఆగస్టు దాకా ఢిల్లీకి వెళ్లడానికి గల కారణాలతో సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన లిక్కర్ మీటింగ్స్‌లో పాల్గొన్నారా? అనే వివరాలు అడిగినట్లు సమాచారం. నిందితులు విజయ్‌నాయర్, సమీర్ మహేంద్రుకు హైదరాబాద్ లిక్కర్ వ్యాపారులతో ఉన్న లింకుల ఆధారంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది.
ఇక ఢిల్లీలో సీబీఐ ముందుకు..!
ఆదివారం విచారణ అనంతరం కవితకు 91 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. తన దగ్గర ఉన్న డిజిటల్ డివైజెస్, డాక్యుమెంట్లను అందించాలని ఆమెను ఆదేశించింది. ఈ సెక్షన్ ప్రకారం కవితనే ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారుల ముందు హాజరై.. డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. సీబీఐ కోరిన ఆధారాలను అందించకపోతే 41 ఏ కింద నోటీసులు ఇచ్చి మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి.
సౌత్ లాబీపై ఆరా
స్కామ్‌లో నిందితులైన సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపారవేత్తల వివరాలతో కవితను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే సేకరించిన సాక్ష్యాధారాలను చూపుతూ.. వాటి గురించి తెలిస్తే చెప్పాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుల వల్ల సౌత్ గ్రూప్‌కు చెందిన ఐదుగురు లిక్కర్ వ్యాపారులు పెద్దమొత్తంలో ఎల్1 లైసెన్స్‌లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌత్ లాబీ ద్వారా చేతులు మారిన రూ.100 కోట్లపై, ఆ గ్రూప్‌తో సంబంధాలపై కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. స్కామ్ కోసం జరిగిన మీటింగ్స్ సమయాల్లో ఆమెకు ఎవరు కాల్ చేశారు.. ఎందుకు కాల్ చేశారనే దానిపై మరింత సమాచారం రాబట్టినట్లు తెలిసింది.
ప్రగతి భవన్‌కు కవిత
సీబీఐ విచారణ ముగిసిన అనంతరం కవిత తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విచారణలో ఏయే ప్రశ్నలు అడిగారు.. వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాననే విషయాలు ఆమె వివరించినట్లు తెలిసింది. ప్రగతి భవన్‌కు రావాలంటూ కేసీఆర్ సూచించడంతో అదే సమ యంలో అక్కడికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కారులో ఆమె ప్రగతి భవన్‌కు వెళ్లారు. లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో కలిసి కేసీఆర్‌తో కవిత సమావేశ మయ్యారు. విచారణ సందర్భంగా ఇచ్చిన సమాధానాలతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురుకావచ్చు.. వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై న్యాయ నిపుణులను కేసీఆర్ అడిగినట్టు తెలిసింది. సీబీఐ తదుపరి చర్యలకు తగ్గట్టుగా అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేయాలని లీగల్ టీంను ఆయన ఆదేశించినట్లు సమాచారం. సీబీఐ విచారణ అనంతరం కవిత ఒక స్టేట్‌మెంట్ ఇస్తారని ఆమె వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే.. కేసీఆర్ ఆదేశాలతో ఆమె హుటాహుటిన తన ఇంటి నుంచి ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందు తన బాల్కని నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అభివాదం చేశారు. విచారణ సందర్భంగా కవిత ఇంటి సమీపంలో ఆమెకు మద్దతుగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.