కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌‌ నిధుల గోల్‌‌మాల్

కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌‌  నిధుల గోల్‌‌మాల్
  • యూనిట్‌‌ 12, స్టేజ్‌‌ 7 ప్రాజెక్టు జీఎస్టీ ఇన్‌‌పుట్‌‌ క్రెడిట్స్‌‌లో అవకతవకలు
  • చీఫ్‌‌ విజిలెన్స్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ

హైదరాబాద్‌‌, వెలుగు : కొత్తగూడెంలోని బీహెచ్‌‌ఈఎల్‌‌ మాజీ సీనియర్‌‌ అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌‌తో పాటు ముగ్గురు ప్రైవేట్‌‌ వ్యక్తులపై సీబీఐ గురువారం కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీబీఐ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం థర్మల్‌‌ పవర్‌‌ ప్రాజెక్ట్‌‌ యూనిట్‌‌ 12లోని స్టేజ్‌‌ 7 పనులకు సంబంధించిన జీఎస్టీ ఇన్‌‌పుట్‌‌ క్రెడిట్స్‌‌ నిధులను దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. బీహెచ్‌‌ఈఎల్‌‌ మాజీ సీనియర్ అకౌంట్స్ అధికారి, డిప్యూటీ మేనేజర్‌‌ శివ నాగేశ్వరరావు ప్రైవేట్‌‌ వ్యక్తులతో కలిసి అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. 

మూడు ప్రైవేట్ కంపెనీల జీఎస్‌‌టీ ఇన్‌‌పుట్‌‌ క్రెడిట్‌‌లను సంబంధం లేని సబ్‌‌ కాంట్రాక్టర్లకు మళ్లించి, లబ్ధి పొందినట్లు విజిలెన్స్‌‌ ఆడిట్‌‌లో బయటపడింది. దీంతో థర్మల్‌‌ పవర్‌‌ ప్రాజెక్ట్‌‌ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని చీఫ్‌‌ విజిలెన్స్‌‌ అధికారి శివపాల్‌‌ సింగ్‌‌ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జోనల్‌‌ సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.