ఆర్యన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. మాజీ NCB అధికారిపై  సీబీఐ కేసు

ఆర్యన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. మాజీ NCB అధికారిపై  సీబీఐ కేసు

బాలీవుడ్ స్టార్ షారూఖ్ కుమారుడి డ్రగ్స్ కేసు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతోంది.. రెండేళ్ల క్రితం డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్ అధికారి సమీర్ వాంఖడేపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం (మే12)న అవినీతి కేసు నమోదు చేసింది. ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌లో కోర్డెలియా క్రూజ్‌ డ్రగ్స్ కేసును   అప్పటి ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేతో పాటు మరికొంత మంది అధికారులు విచారించారు. 

ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌పై  అవినీతి కేసు

ఆర్యన్ ఖాన్‌ను విడిపించేందుకు షారూఖ్‌ఖాన్‌తో ర‌హ‌స్య ఒప్పందం కుదిరింద‌ని.. అప్పటి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే  25 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.   ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లో  దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. అప్పట్లో  వాంఖడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)  ముంబై జోనల్ కు  చీఫ్‌గా ఉన్నారు.  22 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్‌కు మే 2022లో తగిన సాక్ష్యాలు లేనందున ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్‌సీబీ టీమ్, సమీర్ వాంఖడేపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రత్యేక విజిలెన్స్ విచారణ జరిగింది. డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఏడుగురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సమీర్ వాంఖడేను చెన్నైలోని డీజీ పన్ను చెల్లింపుదారుల సేవా డైరెక్టరేట్‌కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇవే ఆరోపణలు..

డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీపై  సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎన్‌సీబీ తనతో బ్లాంక్ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందని ఆరోపించాడు.

ఎవరీ ప్రభాకర్?

ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో మొత్తం తొమ్మిది మందిని ఎన్‌సీబీ సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవీ కూడా ఒకరు. ఆయన బాడీగార్డుగా చెప్పుకుంటున్న ప్రభాకర్ సెయిల్‌ను కూడా ఎన్‌సీబీ విచారించింది. అయితే ఆయన ఎన్‌సీబీపై సంచలన ఆరోపణలు చేశాడు. అప్పటిఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నుంచి తనకు ప్రాణాపాయం ఉందని తెలిపాడు.