సెంట్రల్ టీచర్స్​కు సీటెట్ 

సెంట్రల్ టీచర్స్​కు సీటెట్ 

ఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌‌‌‌రీ ఎడ్యుకేష‌‌‌‌న్‌‌‌‌(సీబీఎస్ఈ) 2023  జులైలో నిర్వహించే సెంట్రల్ టీచ‌‌‌‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌‌‌‌(సీటెట్) నోటిఫికేషన్​ విడుదలైంది. ఏడాదికి రెండు సార్లు నిర్వహించే సీటెట్‌‌‌‌ పాసైన వారు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్‌‌‌‌స్కూల్స్‌‌‌‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీచర్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్ టెస్ట్‌‌‌‌ రాయడానికి  అర్హత సాధిస్తారు.  ఎగ్జామ్​ ప్యాటర్న్, సిలబస్​, అర్హతల గురించి తెలుసుకుందాం.. 

బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు సీటెట్‌‌‌‌లో అర్హత సాధిస్తే.. సీబీఎస్‌‌‌‌ఈ, ఎన్‌‌‌‌సీటీఈ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో.. ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టే అవకాశం దొరుకుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు కేవలం బీఈడీ, డీఈడీ అర్హతతోనే సరిపెట్టుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్‌‌‌‌ లేదా జాతీయ స్థాయిలో సీబీఎస్‌‌‌‌ఈ నిర్వహించే సీటెట్‌‌‌‌లో అర్హత సాధిస్తేనే కొలువు సులువుగా సొంతం చేసుకోవచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: పరీక్ష మొత్తం రెండు పేపర్‌‌‌‌లలో జరుగుతుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి ఎనిమిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. ఎగ్జామ్ లో మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మే 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ) ఎగ్జామ్​ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.ctet.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

సిలబస్​ విశ్లేషణ 

లాంగ్వేజ్‌‌‌‌ పేపర్స్​: అభ్యర్థులు బోధించాలనుకునే భాషలో నిర్వహించే లాంగ్వేజ్‌‌‌‌-1 విభాగంలో రాణించడంతో పాటు ఇతర లాంగ్వేజ్‌‌‌‌ స్కిల్​ పరీక్షించే లాంగ్వేజ్‌‌‌‌-2 పేపర్‌‌‌‌లో సక్సెస్​ కావాలంటే ఆయా భాషా విభాగాలకు సంబంధించి స్కూల్‌‌‌‌ స్థాయిలో సబ్జెక్ట్‌‌‌‌ పుస్తకాలను పూర్తిగా చదవాలి. లాంగ్వేజ్‌‌‌‌–2కు సంబంధించి ఎక్కువ మంది ఇంగ్లీష్‌‌‌‌ను ఎంచుకుంటున్నారు. ఇంగ్లీష్‌‌‌‌లో పార్ట్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇన్‌‌‌‌డెరైక్ట్‌‌‌‌ స్పీచ్, డిగ్రీస్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. పెడగాజికి సంబంధించి టీచింగ్‌‌‌‌ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్‌‌‌‌ స్కిల్స్, ఇంగ్లీష్‌‌‌‌ నేపథ్యంపై ప్రశ్నలు ఎక్కువ ఇస్తున్నారు.

చైల్డ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అండ్‌‌‌‌ పెడగాజి: ఇందులో టీచింగ్​, లెర్నింగ్‌‌‌‌కు సంబంధించి ఎడ్యుకేషనల్‌‌‌‌ సైకాలజీ మీద బేసిక్​ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువ ఫోకస్​ చేయాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను అధ్యయనం చేయాలి. సైకాలజీని చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు -సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే.. ఏ కోణంలో ప్రశ్న అడిగినా ఆన్సర్​ చేయచ్చు.

మ్యాథ్స్​: పేపర్‌‌‌‌–1లో ఒకటి నుంచి అయిదో తరగతి స్థాయిలో.. పేపర్‌‌‌‌–2లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టులపైనే ప్రశ్నలు అడుగుతారు. 

ఎన్విరాన్‌‌‌‌మెంటల్‌‌‌‌ స్టడీస్‌‌‌‌:  ఈ విభాగంలో రాణించేందుకు బోటనీ బేసిక్‌‌‌‌ అంశాలతోపాటు, పర్యావరణ విషయాలు, సైన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ డైలీ లైఫ్‌‌‌‌ వంటి వాటిపైనా ఫోకస్  చేయాలి.

సైన్స్‌‌‌‌: ఇందులో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. పేపర్‌‌‌‌-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌‌‌‌లో ఈ విభాగంలో ప్రశ్నలు కొంత క్లిష్టంగానే ఉన్నాయి. అభ్యర్థులు బేసిక్స్, అప్లికేషన్స్‌‌‌‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్​ చేయాలి. మాక్​ టెస్టులతో ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

సోషల్‌‌‌‌: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. జాగ్రఫీలో  వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్‌‌‌‌ అంశాలను సమకాలీన పరిణామాలతో అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేసుకుంటూ అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.

అర్హత 

పేపర్–1 రాయడానికి (1 నుంచి 5 తరగతులు) కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్, లేదా తత్సమానమైన పరీక్ష పాసై రెండేళ్ల డిప్లొమా ఇన్‌‌‌‌ సెకండరీ ఎడ్యుకేషన్‌‌‌‌ (డీఈడీ) పాస్‌‌‌‌ లేదా సెకండియర్‌‌‌‌ పరీక్షకు హాజరై ఉండాలి. (లేదా ) ఇంటర్‌‌‌‌‌‌‌‌తో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌‌‌పాసై ఉండాలి. గ్రాడ్యుయేషన్‌‌‌‌కు తోడు రెండేళ్ల డిప్లొమా ఇన్‌‌‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌‌‌ (డీఈడీ) పాస్‌‌‌‌ లేదా చివరి ఏడాది పరీక్షలు రాసి ఉండాలి. పేపర్-2 రాయడానికి (6 నుంచి 8 తరగతులు) డిగ్రీ రెండేళ్ల డిప్లొమా ఇన్‌‌‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌‌‌ (డీఈడీ) లేదా డిగ్రీ తో పాటు బీఈడీ పాస్‌‌‌‌ లేదా పరీక్ష రాసి ఉండాలి. లేదా  ఇంటర్ తో పాటు  నాలుగేళ్ల బ్యాచిలర్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌‌‌ పాస్‌‌‌‌ లేదా చివరి ఏడాది పరీక్షలు రాసి ఉండాలి. లేదా డిగ్రీ తో పాటు స్పెషల్ బీఈడీ చేసి ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ కు ఇంటర్‌‌‌‌‌‌‌‌, డిగ్రీలో 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.