ఖమ్మంలోని ఓ ఆస్ప్రత్రిలో పెనుప్రమాదం తప్పింది. బిల్డింగ్ సీలింగ్ కుప్పకూలి పడిపోయింది. ఈ ఘటన వైరా రోడ్డులోని ప్రశాంతి హాస్పిటల్లో జరిగింది. మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జిలేహా అనే మహిళ డయాబెటిస్, లివర్ సంబంధిత జబ్బుతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె కొడుకు ముజ్జు కూడా వచ్చాడు. వైద్యులు పేషంట్‌ను అడ్మిట్ చేసుకొని మొదటి ఫ్లోర్లో ఉంచారు. అయితే పేషంట్‌కు వైద్యం జరుగుతుండగా.. ఆమె కొడుకు పక్కనే ఉన్నాడు. కాగా.. ఉన్నట్టుండి స్లాబ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో జిలేహా, ఆమె కుమారుడు ముజ్జుకు గాయాలయ్యాయి. పేషంట్ తలకి, చేతికి గాయాలు కావడంతో.. స్కానింగ్ నిమిత్తం డయాగ్నొస్టిక్ సెంటర్‌కు తరలించారు. విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మౌలిక సదుపాయాలు కలిపించని హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
