
ప్రధానికి 49 మంది సెలబ్రిటీల ఓపెన్ లెటర్
మూకదాడులు జరగకుండా చర్యలకు రిక్వెస్ట్
నాన్ బెయిలబుల్ కేసులు, యావజ్జీవ శిక్షలకు డిమాండ్
దేశంలో భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి 49మంది సెలబ్రిటీలు ఓపెన్ లెటర్ పంపించారు. దేశంలో జరుగుతున్న మూకదాడులను అరికట్టాలని ప్రముఖులు విజ్ఞప్తిచేశారు. మూకదాడులకు పాల్పడుతున్నవారిని నేరస్తులుగా గుర్తించి… అలాంటి వారికి సరైన శిక్ష వేయాలని మోడీని కోరారు.
బెంగాలీ నటి దర్శకురాలు అపర్ణా సేన్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, సింగర్ శుభాముద్గల్, నటి కొంకనాసేన్, సినీ ప్రముఖులు శ్యామ్ బెనగల్, అనురాగ్ కశ్యప్, మణిరత్నం, మలయాళీ సినీ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ సహా.. కొందరు ప్రముఖులు మోడీకి లెటర్లు రాసినవారిలో ఉన్నారు.
“దేశంలో ముస్లింలు, దళితులు, మైనారిటీలపై దండు దాడులు జరుగుతున్నాయి. వీటిని వెంటనే అడ్డుకట్ట వేయాలి. 2016లో దళితులపై దాడిచేసిన, దళితులను వేధించిన కేసులు 840వరకు నమోదైనట్టు నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో చెబుతోంది. ఐతే.. ఈ దాడులకు పాల్పడిన నిందితులకు శిక్షలు మాత్రం పడటం లేదు. 2009 నుంచి 2018 మధ్య 254 మతపరమైన దాడులకు సంబంధించిన నేరాలు జరిగాయి. ఈ మూకదాడుల్లో 91 మంది చనిపోయారు. 579మంది గాయపడ్డారు. 62 కేసుల్లో ముస్లింలు బాధితులుగా ఉన్నారనీ.. 14 కేసుల్లో క్రిస్టియన్లు బాధితులుగా ఉన్నారని తెలిపారు. మతపరమైన అసహనం పెరిగిపోతోంది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇటువంటి ఘటనలు 90శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి.” అని అన్నారు.
“ఇటువంటి మూకదాడులు సహించేది లేదని పార్లమెంట్ లో ప్రధాని మోడీ చెప్పడం ఒక్కటే పరిస్థితి మార్పునకు సరిపోదు. ఇలాంటి దాడులు చేసేవారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఎవరైనా చనిపోతే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. తమ దేశంలో ఉండాలంటే ఏ పౌరుడు కూడా భయపడే పరిస్థితి రాకూడదు” అన్నారు.
జై శ్రీరాంతోనే వివాదాలు
జై శ్రీరాం అనే నినాదం ఇపుడు చాలా వివాదాలకు కారణమవుతోందన్నారు సెలబ్రిటీలు. ఇదే పేరుతో చాలా అణచివేత, మూకదాడులు , హత్యలు జరుగుతున్నాయన్నారు. దేశంలో మూక దాడులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మోడీని కోరారు.