
విడుదలకు ముందే సెన్సార్ చిక్కులు ఎదుర్కొంటున్న 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' ( Janaki vs State of Kerala )సినిమా వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో 96 కట్స్ సిఫార్సు చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇప్పుడు కేవలం రెండు చిన్న మార్పులతో సినిమాను క్లియర్ చేయడానికి అంగీకరించింది. జూలై 9, 2025న కేరళ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బోర్డు న్యాయవాది ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. మలయాళం నటుడు-, కేంద్ర సహాయమంత్రి సురేష్ గోపి ( Suresh Gopi ), నటి అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran )నటించిన ఈ వివాదాస్పద చిత్రంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు కనిపిస్తోంది. CBFC సూచించిన మార్పులకు చిత్ర నిర్మాతలు ఆంగీకరించారు.
జానకి పేరుపై అభ్యంతరం.. మతపరమైన చిక్కులు?
ముంబైలోని CBFC కార్యాలయం 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసింది. కథానాయిక పేరు 'జానకి' హిందూ దేవత సీత పేరుతో సంబంధం ఉన్నది కావడం, ఆమె లైంగిక దాడికి గురైన కథాంశంలో ఈ పేరును ఉపయోగించడంపై బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. మతపరమైన విభేదాలకు దారితీసే అవకాశం ఉందని, ఈ పేరు ఈ సందర్భానికి తగదని CBFC అభిప్రాయపడింది.
కోర్టులో CBFC వాదన..
CBFC కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో, "గ్రామీణ ప్రాంతంలో దేవత సీత/జానకి పేరుతో ఉన్న కథానాయికపై అత్యాచారం జరిగినప్పుడు, ఆమెకు ఒక మత వర్గానికి చెందిన వ్యక్తి సహాయం చేస్తాడు. అయితే, మరొక మత వర్గానికి చెందిన వ్యక్తి ఆమెను క్రాస్-ఎగ్జామిన్ చేస్తూ, తీవ్రమైన ప్రశ్నలు అడుగుతాడు. సీత పవిత్ర నామాన్ని కలిగి ఉన్న జానకి పాత్రకు ఈ మతపరమైన విభజన, మత సమూహాల మధ్య మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించి, విభజన ధోరణులను సృష్టించే అవకాశం ఉంది" అని పేర్కొంది. ఇలాంటి చిత్రీకరణతో కూడిన వాటిని అనుమతి ఇవ్వడం సరైనది కాదని, భవిష్యత్ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలకు ప్రోత్సాహం అవుతుందని కూడా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ హెచ్చరించింది.
సానుకూల ముగింపు దిశగా..
అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇప్పుడు సినిమా టైటిల్‌ను కొన్ని మార్పులతో కొనసాగించడానికి అనుమతించింది – అవి జానకి V వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ లేదా V జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, కథానాయిక పూర్తి పేరు జానకి విద్యాధరన్‌ను ప్రతిబింబించేలా ఈ మార్పులు సూచించారు. అదనంగా, ఒక ప్రత్యేక క్రాస్-ఎగ్జామినేషన్ సన్నివేశంలో కథానాయిక పేరును మ్యూట్ చేయాలని CBFC సూచించింది.
కేరళలోని CBFC విభాగం గతంలోనే ఈ సినిమాకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ముంబై కార్యాలయం అభ్యంతరాలతో ఈ వివాదం మళ్లీ కోర్టుకు చేరింది. వివిధ ప్రాంతాలలో సర్టిఫికేషన్ విధానంలో ఉన్న వ్యత్యాసాలను గుర్తు చేసింది. జస్టిస్ ఎన్. నాగరేష్ నేతృత్వంలోని కేరళ హైకోర్టు జూలై 5న సినిమాను వీక్షించింది. CBFC సూచించిన పేర్లు మార్పులపై చిత్ర నిర్మాతలు అంగీకరించారు. ఈ విషయాన్ని వారి తరుపున న్యాయవాది హారిస్ బీరాన్ ధర్మాసనం దృష్టికి తెలిపారు.
ALSO READ : ఆ హీరోయిన్ చనిపోయి 3 వారాలు.. ఇప్పుడు గుర్తించిన పోలీసులు..
ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో ఈ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో మలయాళం నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి , అనుమప పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ జూన్ 20న విడుదల కావాల్సింది ఉంది. కానీసెన్సార్ వివాదం కారణంగా ఆలస్యమైంది. తాజా పరిణామాలతో 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా విడుదల తేదీని త్వరలోనే మూవీ మేకర్స్ ఖరారు చేయనున్నారు.