హిందీ తప్పనిసరి కాదు: కేంద్ర ప్రభుత్వం

హిందీ తప్పనిసరి కాదు: కేంద్ర ప్రభుత్వం

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ లో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని విద్యార్థులందరూ హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలంటూ కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ  డ్రాఫ్ట్ లో పెట్టిన రూల్ ను కేంద్రం సవరించింది. బలవంతంగా తమపై హిందీని రుద్దొని దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగడంతో డ్రాఫ్ట్ లో మార్పులు చేసింది కేంద్రం. నాన్ హిందీ రాష్ట్రాల విద్యార్థులు తప్పనిసరిగా హిందీ చదవాలన్న క్లాజ్ ను ఎత్తేసింది.

తాజా సవరణల ప్రకారం… ఆరు లేదా ఏడో తరగతిలో విద్యార్థులు మూడో భాషను ఎంచుకోవటం లేదా మార్చుకోవటం చేసుకోవచ్చని మానవ వనరుల శాఖ తెలిపింది. దేశంలో ఏ రాష్ట్రంలో చదువుతున్నా… మూడు భాషల విధానంలో హిందీ, ఇంగ్లిష్ తప్పనసరిగా ఉండాలని కస్తూరీ రంగన్ కమిటీ డ్రాఫ్ట్ సమర్పించింది. హిందీ తప్పనిసరి అనే నిబంధనపై  దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకల్లో పార్టీలు దానిని రాజకీయ అవకాశంగా మార్చుకునేలా కనిపించింది. తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన PMK, ప్రతిపక్ష DMK, కర్ణాటకలో JDS, మహారాష్ట్రలో MNS, బెంగాల్ లో తృణమూల్ నేతలు హిందీ ఇంపొజిషన్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి.

నిరసనలతో కేంద్రం అలర్ట్ అయింది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని… ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే దానిని కేంద్రం ఆమోదిస్తుందని మంత్రులు ప్రకటించారు. అయినా దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన కంటిన్యూ అవుతుండడంతో… డ్రాఫ్ట్ లో మార్పులు చేసింది. హిందీని తొలగించి ఏవైనా మూడు భారతీయ భాషల్లో నేర్చుకోవాలన్న రూల్ పెట్టింది.