
- దండకారణ్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కారు యుద్ధం
- నాలుగేండ్లలో నక్సలిజాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్
- పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి దీటుగా బలగాల మోహరింపు
- బేస్ క్యాంపులతో పాగా, సెల్‌టవర్లతో కమ్యూనికేషన్
- మానవరహిత విమానాలు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలతో దాడులు
- గడిచిన ఐదు నెలల్లో 113 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్
భద్రాచలం, వెలుగు: మావోయిస్టులపై కేంద్ర సర్కారు యుద్ధం ప్రకటించింది. రాబోయే నాలుగేండ్లలో మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్ మడ్కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ను తీవ్రతరం చేసింది. 30వేలు కూడా లేని పీఎల్జీఏ(పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) ని ఢీకొనేందుకు సుమారు లక్షమందితో కూడిన సీఆర్పీఎఫ్ కోబ్రా, ఐటీబీపీ, డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్, బస్తర్ ఫైటర్స్ తదితర బలగాలను దండకారణ్యం నిండా మోహరించింది.
బస్తర్, దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్, కొండెగావ్, సుక్మా జిల్లాల పరిధిలో భారీ ఎత్తున బేస్ క్యాంపులు, కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లు ఏర్పాటుచేసిన సేనలు అధునాతన ఆయుధాలు, మానవరహిత విమానాలు, డ్రోన్లతో మావోయిస్టులకు ఊపిరాడనివ్వట్లేదు. ఈ ఏడాది జనవరి నుంచి కూంబింగ్ల పేరుతో మావోయిస్టుల డెన్లలోకి చొచ్చుకెళ్తున్న బలగాలు గడిచిన ఐదునెలల్లో 113 మంది మావోయిస్టులను మట్టుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
మావోయిస్టుల కంచుకోటపై వార్..
ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సహా తొమ్మిది రాష్ట్రాలతో కూడిన రెడ్‌కారిడార్ కేంద్రంగా భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించిన మావోయిస్టులు కాలక్రమంలో ప్రస్తుత చత్తీస్‌గఢ్‌కు, అందులోనూ దండకారణ్యానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ‘అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ వ్యాక్యూమ్ ఏరియా’ పేరుతో అబూజ్మడ్కేంద్రంగా సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులపై ‘అపరేషన్ కగార్’ పేరుతో చత్తీస్‌గఢ్‌తో కలిసి కేంద్ర సర్కారు ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నది. బస్తర్ప్రాంతానికి మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నంత పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి కూంబింగ్ల పేరుతో మావోయిస్టుల కంచుకోటలోకి చొచ్చుకెళ్తున్న బలగాలు, భారీ ఎన్కౌంటర్లలో పెద్దసంఖ్యలో నక్సల్స్‌ను మట్టుపెడ్తున్నారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా 30వేలమంది మావోయిస్టులతో కూడిన పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ని తుదముట్టించేందుకు సుమారు లక్షమందితో కూడిన భారత, చత్తీస్‌గఢ్ బలగాలను అబూజ్మడ్ చుట్టూ మోహరించారు. వీరిలో సుశిక్షితులైన సీఆర్పీఎఫ్ కోబ్రా, ఐటీబీపీ, డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్, బస్తర్ ఫైటర్స్ తదితర దళాలున్నాయి. దట్టమైన అడవులు, కొండలతో 5,200 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అబూజ్మడ్ అత్యధికంగా నారాయణ్‌పూర్ జిల్లా (4వేల చదరపు కిలోమీటర్లు) పరిధిలోనే ఉంది. దంతెవాడ, బీజాపూర్, కొండెగావ్, సుక్మా జిల్లాల్లో పాక్షికంగా విస్తరించి ఉంది. ఈ జిల్లాల్లో ప్రతి ఐదు చదరపు కిలోమీటర్ల కు ఒకటి చొప్పున బేస్‌క్యాంపులు, కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లు ఏర్పాటుచేసిన కేంద్ర, రాష్ట్ర బలగాలు.. అధునాతన ఆయుధాలు, మానవరహిత విమానాలు, డ్రోన్ల ద్వారా విరుచుకుపడ్తూ మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే 24 వరకు ఏకంగా 113 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. 2019లో 65 మంది, 2020లో 40, 2021లో 51, 2022లో 30, 2023లో 22 మంది చనిపోగా, ఈ ఏడాది ఐదు నెలల్లోనే అంతకు భారీగా ప్రాణనష్టం కలగడం గమనార్హం. నిజానికి 2009 నుంచే నాటి ప్రభుత్వం కోబ్రా(కమాండో బెటాలియన్స్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) బలగాలతో ఆపరేషన్ గ్రీన్ హంట్ కింద మావోయిస్టుల ఏరివేత ప్రారంభించినా ఈ తరహా నష్టం మావోయిస్టులకు గతంలో ఎప్పుడూ జరగలేదు.
ఇటీవలి భారీ ఎన్కౌంటర్లు
- ఏప్రిల్ 3: బీజాపూర్ జిల్లా లేండ్రా-కోర్చోలీ మధ్య ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు.
- ఏప్రిల్ 16: కాంకేర్ జిల్లా చోటేబెటియా గ్రామ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు.
- ఏప్రిల్ 30: నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్టేక్మెట్టా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు నేలకొరిగారు.
- మే 10: బీజాపూర్- సుక్మా- దంతెవాడ జిల్లాల బార్డర్లో పిడియా గ్రామంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది హతమయ్యారు.
- మే 23: బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సల్స్ చనిపోయారు.
ఆదివాసీ యువతకు దగ్గరై.. అదును చూసి దెబ్బ
ఇన్నాళ్లూ అబూజ్‌మడ్‌లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టులు ఇప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. గడిచిన ఐదేండ్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, వైద్య సేవల ద్వారా ఆదివాసీలకు దగ్గరవుతూ వచ్చిన బలగాలు వాళ్ల ద్వారా మావోయిస్టుల ఆనుపానులు తెలుసుకొని ఇప్పుడు అదును చూసి దెబ్బకొడ్తున్నాయి. ఈ జనవరి నుంచి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్తూ మావోయిస్టుల గుప్పిట్లోని ప్రాంతాలన్నింటినీ ఒక్కొక్కటిగా చేజిక్కించుకుంటున్నాయి. ఆదివాసీల్లో ఉన్న నిరక్షరాస్యత, పేదరికరాన్ని ఆసరాగా చేసుకున్న మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రచారం చేయడంలో చత్తీస్‌గఢ్ పోలీసులు, భారత బలగాలు సక్సెస్ అయ్యాయి. బస్తర్‌ను నక్సల్స్ విముక్తి ప్రాంతంగా చేస్తేనే పరిశ్రమలు వస్తాయని, టూరిజం అభివృద్ధి చెంది, స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆదివాసీ యువతను నమ్మించగలిగాయి. ఈ క్రమంలో ఆదివాసీల సహకారం వల్లే క్రమంగా బలగాలు బస్తర్ పై పట్టు సాధిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లన్నీ ఈ కోవలోనివేనని చెప్తున్నారు. అబూజ్‌మడ్‌లో ఉన్న ఐరన్ ఓర్, ఇతర ఖనిజ సంపదపై కన్నేసిన ఎన్డీఏ సర్కారు, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం వాటిని కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకే తమపై యుద్ధం ప్రకటించిందని మావోయిస్టులు కూడా కౌంటర్ ప్రచారం చేస్తున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు వారిపై ఉన్న రివార్డు మొత్తంతో పాటు తక్షణ సాయం కింద సర్కారు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు, కేసుల ఎత్తివేత, వ్యవసాయ భూమి, ఇల్లు కట్టించి ఇవ్వడం లాంటి పునరావాస చర్యలు కూడా సత్ఫలితాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత రెండేళ్లలో 800 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 200 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇలా లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో ప్రస్తుతం అబూజ్‌మడ్‌లో మావోయిస్టులు మనుగడ కోసం పోరాడుతున్నారని చెప్పక తప్పదు.