దేశంలో 16 కోట్ల డ్రింకర్స్.. అందులో కోటి మంది మహిళలే

దేశంలో 16 కోట్ల డ్రింకర్స్.. అందులో కోటి మంది మహిళలే
  • దేశ జనాభాలో మద్యం తాగేవాళ్లు 14.6 శాతం
  • 10 నుంచి 75 మధ్య వయసున్నోళ్లు తాగుతున్నారు
  • 16 కోట్ల డ్రింకర్స్‌లో 94 లక్షల మంది మహిళలు
  • తెలంగాణలో 30%, ఏపీలో 26% మగవాళ్లు డ్రింకర్సే

దేశంలో పదేళ్ల వయసుకే కొందరు పిల్లలు మద్యానికి బానిసలవుతున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఈ పరిస్థితి దాపురించింది. ఈ విషయాన్ని ఏ చిన్నా చితకా సర్వే సంస్థలు చెప్పిన విషయం కాదు. స్వయంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ వెల్లడించిన రిపోర్ట్‌లో బయటపడిన చేదు నిజం ఇది. దేశంలో పదేళ్ల వయసు నుంచే మద్యం తాగుతున్న వాళ్లు ఉన్నారని గుర్తించింది. దేశంలో 10-75 ఏళ్ల మధ్య వాళ్లు మద్యం తాగుతున్న వారి సంఖ్య 16 కోట్లు ఉందని కేంద్రం తెలిపింది. అంటే ఇది మన దేశ జనాభాలో 14.6 శాతం.

17 మంది మగవాళ్లకు ఒక మహిళ

మొత్తంగా దేశంలో మద్యం తాగే వాళ్లు 16 కోట్లు ఉండగా వారిలో 95 శాతం 18-45 మద్య వయస్కులే. అయితే 1:17 నిష్పత్తిలో మందు తాగే మహిళలు  ఉన్నారు. అంటే 17 మంది మగవాళ్లకు ఒకరు చొప్పున ఆడవాళ్లు మందు కొడుతున్నారు. సుమారుగా దేశంలో 94 లక్షల మంది వరకు లిక్కర్ తీసుకుంటున్నారు.

వాళ్లకు మంచి కంట్రోల్

అమ్మాయిలు కూడా లిక్కర్ అలవాటు చేసుకుంటున్నా.. దానిపై కంట్రోల్ విషయంలో మగవాళ్ల కంటే వాళ్లు చాలా బెటర్. మగవాళ్లలో 27.3 శాతం మద్యానికి బానిసలైపోతే.. కేవలం 1.6 శాతం మాత్రమే ఆడవాళ్లు అడిక్ట్ అయ్యారు. ఆల్కహాల్ తీసుకునే వాళ్లలో ప్రతి ఐదుగురిలో ఒక మగవాడు అడిక్ట్ అయిపోగా.. ఆడవాళ్లలో 16లో ఒక్కరు మాత్రమే అలా ఉన్నారని సర్వే చెప్పింది.

బీర్ ప్రియులు 21 శాతం

మందు ప్రియులు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కంటే దేశీ మద్యానికే ప్రయారిటీ ఇస్తున్నారు. మొత్తం లిక్కర్ తాగే వాళ్లలో మూడొంతులు దేశీ లిక్కర్‌కే ఓటేస్తున్నారు. ఇక కాస్ట్లీ వైన్ తాగే వాళ్లు మన దేశంలో చాలా తక్కువే. ఆల్కహాల్ తీసుకునేవాళ్లలో కేవలం 4 శాతం మాత్రమే వైన్ తాగుతున్నారు. బీరు ప్రియులు మాత్రం బలంగానే ఉన్నారు. మొత్తం 16 కోట్ల మందిలో 21 శాతం బీర్ తాగేవాళ్లున్నారు. స్ట్రాంగ్ బీర్ తాగేవాళ్లు 12 శాతం ఉంటే, లైట్ బీర్ తాగే వాళ్లు 9 శాతం ఉన్నారు.

స్ట్రాంగ్‌గా ఉండాలనే కోరుకుంటన్నారు

ఆల్కహాల్ తాగే వాళ్లలో ఎక్కువ మంది స్ట్రాంగ్‌గా తీసుకోవాలనే కోరుకుంటున్నారని సర్వే చెబుతోంది. ఇక పార్టీలో మందు తాగుతూ కూర్చుంటే ప్రతి ఇద్దరిలో ఒకరు కనీసం నాలుగు బీర్లు అంత కంటే ఎక్కువ లేదా ఒక హాఫ్ బాటిల్ లిక్కర్ లేపేయాలనుకునేవాళ్లే ఎక్కువ. ఈ హెవీ డ్రింకర్ల కేటగిరీ మందు ప్రియులు 43 శాతం ఉన్నారు. ఇక ప్రతి నలుగురు డ్రింకర్స్‌లో ఒకరు మందు తాగిన తర్వాత ఫుల్‌గా ఎక్కేసిందంటూ పడిపోయి, నానా రచ్చ చేసేవాళ్లేనట.

రాష్ట్రాల వారీగా చూస్తే..

దేశ వ్యాప్తంగా మద్యం తాగేవారి లెక్క తీస్తే టాప్‌లో ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ఉంది. ఈ రాష్ట్రంలో 62 శాతం జనాభా లిక్కర్ తాగేవాళ్లున్నారు. రెండో స్థానంలో ఛత్తీస్‌గఢ్ (57.2%), మూడో స్థానంలో పంజాబ్ (51.7%) ఉన్నాయి. 30 శాతానికిపైగా డ్రింకర్స్ ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 15 ఉన్నాయి. మన తెలంగాణలో 30.4 శాతం, ఏపీలో 26.5 శాతం మందుప్రియులున్నారు. ఈ లెక్క కేవలం మగవాళ్లకు సంబంధించినవి మాత్రమే.