జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలకు సర్కారు సాయం

జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలకు సర్కారు సాయం

వెలుగు బిజినెస్​ డెస్క్:  ప్రభుత్వ రంగంలోని జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. ఇందుకోసం ఆ కంపెనీలకు రూ. 5 వేల కోట్ల క్యాపిటల్​ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నెల రోజులలోపే ఈ ప్రకటన వెలువడుతుందని సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. ప్రభుత్వ రంగంలో నాలుగు ఇన్సూరెన్స్​ కంపెనీలుంటే, అందులో మూడు కంపెనీలు నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. ఆ కంపెనీలకు నష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఏ పోర్ట్​ఫోలియోల వల్ల వస్తున్నాయి, క్లెయిమ్​ మేనేజ్​మెంట్​ ఎలా మెరుగుపరచాలనే అంశాలపై తాజా ప్లాన్​ ఫోకస్​ పెడుతుందని  ఆ సీనియర్​ ఆఫీసర్​ వెల్లడించారు. వ్యాపారం కోసం నాలుగు ప్రభుత్వ కంపెనీలు ఒక దానితో ఒకటి పోటీపడి రేట్లు తగ్గించకుండా చర్యలు తీసుకోనున్నట్లు కూడా పేర్కొన్నారు.నాలుగు జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలకు రూ. 4,950 కోట్ల క్యాపిటల్​ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్​ చేసింది. ఈ నెల మొదట్లోనే మూడో సప్లిమెంటరీ డిమాండ్​లో ఈ ప్రపోజల్​ పెట్టారు.

ఏ కంపెనీ ఎలా ఉంది....
ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి 9 నెలల్లో ఓరియెంటల్​ ఇన్సూరెన్స్​ రూ. 1,983 కోట్లు, నేషనల్​ ఇన్సూరెన్స్ రూ. 679 కోట్లు​, యునైటెడ్​ ఇండియా ఇన్సూరెన్స్​ రూ. 1,194 కోట్ల నష్టాలను పొందాయి. మరోవైపు న్యూ ఇండియా ఎష్యూరెన్స్​ ఒక్కటే లాభాలు చూస్తోంది. ఈ కంపెనీ ఈ ఫైనాన్షియల్​ మొదటి 9 నెలల్లో రూ. 700 కోట్ల లాభం ఆర్జించింది. దీంతో ఈ కంపెనీకి ప్రభుత్వం క్యాపిటల్​ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐఆర్​డీఏఐ రూల్స్​ ప్రకారం ఉండాల్సిన సాల్వెన్సీ రేషియోలోనూ న్యూ ఇండియా ఎష్యూరెన్స్​ఒక్కటే ముందుంది. మిగిలిన మూడు కంపెనీల రేషియో నిబంధనల కంటే తక్కువగానే ఉంది. 

మెర్జర్​ ప్లాన్​....
నిజానికి నాలుగు జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలలో మూడింటిని మెర్జర్​ చేయాలనుకుంటున్నట్లు 2018–19లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓరియెంటల్​ ఇన్సూరెన్స్​, నేషనల్​ ఇన్సూరెన్స్​, యునైటెడ్​ ఇండియా ఇన్సూరెన్స్​కంపెనీలను విలీనం చేసి, ఆ కొత్త సంస్థను స్టాక్​ మార్కెట్లో లిస్ట్​ చేయాలనుకున్నది. ఈ కంపెనీల నష్టాలు పెరగడంతో ఆగిపోయింది.  నాలుగు జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలలో ఒకదానిని ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.   న్యూ ఇండియా ఎష్యూరెన్స్​ ఇప్పటికే స్టాక్​ మార్కెట్లో లిస్టయింది. యునైటెడ్​ ఇండియాను  ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని నీతి ఆయోగ్​ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం.