కేంద్రం డబ్బులిస్తే.. దారి మళ్లించారు

కేంద్రం డబ్బులిస్తే.. దారి మళ్లించారు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహాయం చేసిందని.. ఎన్నో నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాను చెప్పిన లెక్కలపై సీఎం కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని..దీనిపై తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్ లో ముగిసిన సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఆ పార్టీ నాయకులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎంత మేర నిధులు కేటాయించిందో గణాంకాలతో సహా కిషన్ రెడ్డి సభలో వివరించారు. 

కేంద్రంపై విష ప్రచారం...
రాష్ట్రానికి ఎప్పటికప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే..కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ కు వచ్చే రోడ్డుకు రూ. 2,295 కోట్లు, హైదరాబాద్, యాదాద్రి రోడ్డుకు రూ.388 కోట్లు, యాదాద్రి నుంచి వరంగల్ కు రూ. 1,907 కోట్లు, వరంగల్ బైపాస్ రోడ్డు కోసం రూ. 550 కోట్లు, హైదరాబాద్ నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ. 2,300 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. హైదరాబాద్ నుంచి జగిత్యాల, కరీంనగర్ రోడ్డు కోసం రూ. 2, 174 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ప్రకటించారు. కరీంనగర్ నుంచి వరంగల్ నాలుగు లేన్ల రోడ్డుకు రూ. 4321 కోట్లు, వరంగల్ నుంచి మంచిర్యాల రోడ్డుకు రూ. 4, 137 కోట్లు, వరంగల్ నుంచి ఖమ్మం నాలుగు లేన్ల రోడ్డుకు రూ. 3, 364 కోట్లు... ఇలా అనేక అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతోందన్నారు. 

వరంగల్ కు ఎన్ని నిధులు కేటాయించారు...
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. వీరభద్ర రామప్ప ఆలయానికి యునోస్కో గుర్తింపు తెచ్చిన ఘనత కేంద్రానికి దక్కుతుందన్నారు. ఆలయానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు పెట్టబోతోందన్నారు. వేయి స్తంభాల గుడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని.. వేయి స్తంభాల కళా మంటపం పడిపోయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. డిసెంబర్ లోపు వెయి స్తంభాల కళా మంటపాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ పోర్టుకు సౌండ్ అండ్ సిస్టం కోసం రూ. 5 కోట్లు కేటాయించినట్లు.. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. వరంగల్ జిల్లాలో ఎల్దుర్ది ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ మంజూరు చేసిందని.. ఎంవోయూ చేసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలి వేయాలి
గత రెండు సంవత్సరాల్లో పత్తి కొనుగోలు కోసం రూ. 8260 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని విమర్శించారు. రూ. 800 కోట్లతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో గిరిజన యూనివర్సిటీ వస్తుందన్నారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించామో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మేధావులు, రాజకీయ వేత్తలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలి వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, రైతుల నుంచి పంటలు, వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమ పాలన చేస్తామని తెలిపారు.