భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో.. కేంద్ర బృందం పర్యటన

భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో.. కేంద్ర బృందం పర్యటన
  • ఫొటో ఎగ్జిబిషన్​ చూసిన టీమ్​
  • దెబ్బతిన్న పంటలు, రోడ్ల పరిశీలన
  • పూర్తి రిపోర్ట్​ అందజేసిన కలెక్టర్ ​ప్రియాంక ఆల
  • కేంద్రానికి నివేదిక అందజేస్తామన్న సెంట్రల్​టీమ్​

భద్రాచలం/బూర్గంపహాడ్, వెలుగు : గోదావరి వరద నష్టం అంచనా వేసేందుకు గురువారం కేంద్ర బృందం భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించింది. ఇందులో హోం మంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్​ సత్యార్థి, డిపార్ట్​మెంట్​ఆఫ్​ ఎక్స్ పెండేచర్ ​డిప్యూటీ సెక్రటరీ అనిల్​ గైరోలా, సెంట్రల్​ వాటర్ కమిషన్​ డైరెక్టర్​రమేశ్​కుమార్, మినిస్ట్రీ ఆఫ్​పవర్ ​డిప్యూటీ డైరెక్టర్​భయాపాండే, నేషనల్ ​రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​సీనియర్ ​సైంటిస్టు శ్రీనివాసులు, ఆయిల్ సీడ్స్ డైరెక్టర్​ డా.పొన్నుస్వామి, ఐఈఆర్​ఎస్ ​రీజనల్ ​ఆఫీసర్​ఎస్కే కుస్వా ఉన్నారు. ముందుగా ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​లో దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లు, కరెంట్ లైన్లు, కొట్టుకుపోయిన వంతెనలు, చెక్​డ్యాంలు, మిషన్ భగీరథ పైపులైన్లు, చనిపోయిన పశువులు, కుళ్లిపోయిన పత్తి చేల ఫొటోలు చూశారు. బూర్గంపాడులోని పుల్లేరువాగు, కొల్లుచెరువులు, గోదావరి వరద వల్ల నాశనమైన పత్తి పంటలను పరిశీలించారు. 

బూర్గంపాడు–-కుక్కునూరు రూట్​లో కోతకు గురైన రోడ్డును చూశారు. అశ్వాపురం మండలం ఆనందాపురంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైందని కలెక్టర్​ ప్రియాంక అలా సెంట్రల్​ టీంకు వివరించారు. దీంతో గోదావరి మూడు ప్రమాద హెచ్చరికలను జారీ చేశామన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో 84 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 4,454 కుటుంబాలకు చెందిన 14,081 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. 11 చోట్ల మిషన్​భగీరథ పైపులు దెబ్బతిన్నాయని తెలిపారు. 6 మండలాల పరిధిలోని 9 గ్రామాల్లో 15 పశువులు, 19 మేకలు, 3,030 కోళ్లు చనిపోయినట్లు చెప్పారు. 41 ఇండ్లు పూర్తిగా, 162 పాక్షికంగా దెబ్బతిన్నట్లు వివరించారు. 16 మండలాల పరిధిలోని 44 గ్రామాలకు చెందిన 1,402 మంది రైతుల 3,151 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. 

పంచాయతీరాజ్​శాఖకు చెందిన 115రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఆర్అండ్​బీకి చెందిన 61 రోడ్లు డ్యామేజ్​ అయ్యాయన్నారు. వివరాలు పరిశీలించిన సెంట్రల్​ టీం జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేస్తామని తెలియజేసింది. ఎస్పీ డా.వినీత్​, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్​, అడిషనల్ కలెక్టర్​లోకల్​బాడీస్​ మధుసూధన్​రాజు, ఇరిగేషన్​ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఆర్అండ్​బీ ఈఈ బీమ్లా, పంచాయతీరాజ్​ ఈఈ మంగ్యా, జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, పశుసంవర్ధకశాఖ డీడీ పురంధర్​, మిషన్​భగీరథ ఈఈలు తిరుమలేశ్, నళిని ఉన్నారు.