
న్యూఢిల్లీ: ప్రజలు ఎక్కువగా ఉపయోగించే 35 ముఖ్యమైన మందుల ధరలను కేంద్రం ప్రభుత్వం తగ్గించింది. డయాబెటిస్ , క్యాన్సర్, హైపర్‌టెన్షన్ చికిత్సకు వాడే మందులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ధరలు 14శాతం నుంచి గరిష్టంగా 53శాతం వరకు తగ్గాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఉత్తర్వుల ప్రకారం, ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి.
డయాబెటిస్‌కు వాడే గ్లిక్లాజైడ్, మెట్‌ఫార్మిన్, హైపర్‌టెన్షన్ మందులు టెల్మిసార్టన్, రామిప్రిల్, క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు, ఇన్‌ఫెక్షన్‌ల చికిత్సలో వాడే అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్ వంటి యాంటీబయాటిక్స్ ధరలు తగ్గాయి. అలర్జీలు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులకు వాడే మందుల రేట్లు కూడా దిగివచ్చాయి.