
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో పూర్తి ఏడాది టార్గెట్‌లో 17.9శాతానికి చేరుకుందని అని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (కాగ్) తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2024–-25) మొదటి మూడు నెలల్లో ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ (బీఈ)లో 8.4శాతం వద్ద ఉంది. ప్రభుత్వ ఖర్చు, ఆదాయం మధ్య లోటు (ఆర్థిక లోటు) 2025–-26 -జూన్ క్వార్టర్‌లో రూ.2,80,732 కోట్లుగా నమోదైంది. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు జీడీపీలో 4.4శాతంగా, అంటే రూ.15.69 లక్షల కోట్లుగా నమోదవుతుందని అంచనా వేసింది.
సీజీఏ డేటా ప్రకారం, జూన్ క్వార్టర్‌లో నికర పన్ను ఆదాయం రూ.5.4 లక్షల కోట్లుగా ఉంది. ఇది 2025–-26 బీఈలో 19శాతం వాటాకు సమానం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నికర పన్ను ఆదాయం బీఈలో 21.3శాతం వద్ద నిలిచింది. మొదటి క్వార్టర్‌లో మొత్తం ఖర్చు రూ.12.22 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది బీఈలో 24.1శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ఈ నెంబర్ అప్పటి బీఈలో 20.1 శాతం వద్ద ఉంది.