కేంద్ర ప్రభుత్వం, బెంగాల్​ సర్కార్‌ల‌ మధ్య మరో వివాదం

కేంద్ర ప్రభుత్వం, బెంగాల్​ సర్కార్‌ల‌ మధ్య మరో వివాదం
  • బంగ్లాదేశ్​కు కార్గో సర్వీసుల్ని అడ్డుకుంటోంది
  • పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి
  • బెంగాల్​ సీఎస్​కు లెటర్​ రాసిన కేంద్ర హోం శాఖ సెక్రెటరీ
  • ఇప్పటికే పలు అంశాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, బెంగాల్​ సర్కార్‌ల‌ మధ్య మరో వివాదం ఏర్పడింది. బంగ్లాదేశ్​కు నిత్యావసరాలను పంపే కార్గో సర్వీసులను బెంగాల్​ అడ్డుకుంటోందని కేంద్రం ఆరోపించింది. బెంగాల్​ చర్యల వల్ల ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర, నిత్యావసర సేవలకు సంబంధించి కార్గో సర్వీసులు నాన్​ స్టాప్​గా నడవాలని చెబుతున్నా బెంగాల్​ పట్టించుకోవడం లేదని విమర్శించింది. దీని వల్ల బంగ్లాదేశ్​కు నిత్యావసర, అత్యవసర వస్తువులతో వెళుతున్న అనేక ట్రక్కులు బెంగాల్​లో చిక్కుకుపోయాయని తెలిపింది. బంగ్లాదేశ్​ నుంచి తిరిగి వస్తున్న ట్రక్​ డ్రైవర్లకు కూడా దేశంలోకి అనుమతించడం లేదని ఆరోపించింది. పొరుగు దేశాలతో ఉన్న ట్రేడ్​ డీల్స్​ కారణంగా సరిహద్దుల వెంబడి కార్గో సేవలను అడ్డుకోవడం ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి తగదని పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర హోం శాఖ సెక్రెటరీ అజయ్​ భల్లా.. బెంగాల్​ సీఎస్​ రాజీవ్​ సిన్హాకు బుధవారం ఓ లేఖ రాశారు. ఏప్రిల్​ 24న జారీ చేసిన గైడ్​లైన్స్​ ప్రకారం ఇండో–నేపాల్, ఇండో–బంగ్లాదేశ్, ఇండో–భూటాన్​ మధ్య క్రాస్​ బార్డర్ కార్గో సర్వీసులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఇంటర్నేషనల్​ కార్గో సర్వీసులను అడ్డుకోవడం డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ను ఉల్లంఘించడమేనన్నారు.

ఇప్పటికే కేంద్ర జారీ చేసిన పలు గైడ్​ లైన్స్ విషయంలో బెంగాల్, కేంద్రం మధ్య వివాదాలు నడుస్తున్నాయి. కరోనా పరిస్థితులు, లాక్​డౌన్​ అమలు గురించి తెలుసుకునేందుకు వెళ్లిన సెంట్రల్​ టీమ్.. బెంగాల్​ సర్కార్​పై విమర్శలు చేసింది. దేశంలోనే కరోనా మరణాల రేటు బెంగాల్​లో ఎక్కువగా ఉందని, ఎక్కువ టెస్టులు చేయకపోవడం, సరైన సర్వయిలెన్స్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న రిపోర్ట్స్​కు, రాష్ట్రం రిలీజ్​ చేస్తున్న బులెటిన్లకు సంబంధం ఉండటం లేదని చెప్పింది. అయితే ఈ విమర్శలపై బెంగాల్ సీఎం, తృణమూల్​ చీఫ్ మమతా బెనర్జీ ఘాటుగానే స్పందించారు. కేంద్రం తమకు సరైన కిట్లను సరఫరా చేయలేదని ఆరోపించారు. సెంట్రల్​ టీమ్​ ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో పొలిటికల్​ వైరస్​ను బెంగాల్​లో స్ప్రెడ్​ చేయడమేనని టీఎంసీ లీడర్​ డెరిక్​ ఒబ్రయన్​ మండిపడ్డారు.