త్వరలోనే రూ.75కాయిన్ రిలీజ్.. కొత్త పార్లమెంట్ భవనానికి ప్రతీకగా లాంఛ్

త్వరలోనే రూ.75కాయిన్ రిలీజ్.. కొత్త పార్లమెంట్ భవనానికి ప్రతీకగా లాంఛ్

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 నాణెం విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న భారతదేశానికి నివాళిగా కూడా ఈ నాణెం ఉపయోగపడుతుందని తెలిపింది.

కొత్త రూ.75కాయిన్ డిజైన్ ఎలా ఉంటుందంటే..

నాణేనికి ఒక వైపు అశోక స్తంభం సింహ రాజధాని, దాని క్రింద "సత్యమేవ జయతే" అని ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో "భారత్", కుడి వైపున ఆంగ్లంలో "భారత్" అనే పదం రాయబడి ఉంటుంది. ఈ కాయిన్​పై రూపీ సింబల్​తో పాటు డినామినేషన్​ వాల్యూగా 75 ఉండనుంది. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది. ఎగువ అంచున దేవనాగరి లిపిలో "సంసద్ సంకుల్", దిగువ అంచున ఆంగ్లంలో "పార్లమెంట్ కాంప్లెక్స్" అనే పదాలు రాయబడి ఉంటాయి.

నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. దాని అంచుల వెంట 200 సెరేషన్‌లను కలిగి ఉంటుంది. 35 గ్రాముల ఈ నాణెం నాలుగు భాగాల మిశ్రమంతో తయారు చేయబడుతుంది, ఇందులో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉన్నాయి.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మే 28న ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దాదాపు 25 పార్టీలు హాజరుకానుండగా, కనీసం 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్, సమాజ్ వాదీ పార్టీలు.. పార్లమెంట్​ భవనాన్ని మోదీ ప్రారంభించడమేంటి? అని ప్రశ్నిస్తున్నాయి. వేడుకలను బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎన్​డీఏ పక్షాలు మండిపడుతున్నాయి.