ఎమ్మెల్సీ ఎలక్షన్: క్యాంపు రాజకీయాలపై దర్యాప్తు చేసినం

ఎమ్మెల్సీ ఎలక్షన్: క్యాంపు రాజకీయాలపై దర్యాప్తు చేసినం

హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) శశాంక్ గోయల్ తెలిపారు. మొత్తంగా 37 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని.. ఈ ఎన్నికల్లో 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ వార్డ్ మెంబర్లతోపాటు నగర పంచాయతీ మెంబర్లు ఓటర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. క్యాంపు రాజకీయాలపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై జిల్లా అధికారులు దర్యాప్తు చేశారన్నారు. అయితే ప్రజాప్రతినిధుల కుటుంబీకులు తమకు ఎలాంటి సమస్య లేదని చెప్పారని పేర్కొన్నారు. 

‘శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ లో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను వినియోగించుకోవాలి. వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ను సునిశితంగా పరిశీలిస్తాం. పోలింగ్ స్టేషన్ లోకి ఓటర్లు ఎలాంటి సెల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇప్పటికే ఓటర్లందరికీ ఓటరు స్లిప్ లను జారీ చేశాం. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి పోలింగ్ స్టేషన్ బయట భౌతిక దూరం పాటించడం కోసం మార్కింగులు చేశాం. అందరూ మాస్కులు వేసుకుని రావాలి. మెడికల్ డెస్కులను ఏర్పాటు చేశాం. అక్కడ ఓటర్లకు థర్మల్ స్కానింగ్ చేసి.. శానిటైజర్, గ్లౌజులు ఇస్తారు. ఎన్నికలు శాంతియుతంగా పూర్తి చేసేందుకు ఓటర్లు, రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని శశాంక్ గోయల్ పేర్కొన్నారు.