పట్టపగలే చైన్ స్నాచింగ్.. దొరికిపోయిన దొంగ

పట్టపగలే చైన్ స్నాచింగ్.. దొరికిపోయిన దొంగ

సికింద్రాబాద్: మిట్ట మధ్యాహ్నం వేళ.. చుట్టూ జనం ఉండగా.. నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్ జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ గోపాలపురం ఏరియాలోని సంగీత్ క్రాస్ రోడ్డు వద్ద యువతి మెడలోని గొలుసును తెంపుకొని పారిపోవడానికి దొంగ యత్నించాడు. దీన్ని గమనించిన గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు పరుగెత్తి అతన్ని  పట్టుకున్నారు. అనంతరం గోపాలపురం లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తి సిద్దిపేట జిల్లా నాగపురి గ్రామానికి చెందిన కొమురవెల్లి బాబి(31) అని దర్యాప్తులో వెల్లడైంది.

ఒడిశాకు చెందిన సదరు యువతి బ్యాంకు కోచింగ్ సెంటర్ల వివరాలను తెలుసుకునేందుకు స్థానికంగా ఉండే తన బంధువుతో కలిసి బైక్ పై అమీర్ పేటకు బయలుదేరింది. సంగీత్ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్నాక.. యువతిని దింపి, బైక్ లో పెట్రోలు నింపుకునేందుకు ఆమె బంధువు పెట్రోలు బంక్ లోపలికి వెళ్లాడు. పెట్రోలు బంక్ ఎదుట ఓ వైపునకు నిలబడిన యువతిని దొంగ అనుసరించాడు. ఒక్క ఉదుటున దూసుకొచ్చి ఆమె మెడలో ఉన్న దాదాపు 2 తులాల చైన్ ను బలంగా లాగి తెంపాడు. అతడు పారిపోతుండగా ట్రాఫిక్ పోలీసులు, అటుగా వెళ్తున్నవారు కలిసి పట్టుకున్నారు.  సీసీ కెమెరాలో ఈ చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి.