పంజాబ్​ వర్సిటీలకు ఇక ముఖ్యమంత్రే చాన్స్​లర్

పంజాబ్​ వర్సిటీలకు ఇక ముఖ్యమంత్రే చాన్స్​లర్
  • బిల్లుకు పంజాబ్​ అసెంబ్లీ ఆమోదం

చండీగఢ్: పంజాబ్​లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మంగళవారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీలకు చాన్స్​లర్​గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించే బిల్లును పాస్​ చేసింది. ఈమేరకు పంజాబ్ విశ్వవిద్యాలయాల చట్టాల (సవరణ) బిల్లు, 2023 స్వల్ప చర్చ తర్వాత ఆమోదం తెలిపింది. దీనికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు శిరోమణి అకాలీదళ్(ఎస్​ఏడీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూడా మద్దతు పలికాయి.

గత ఏడాది వైస్ చాన్స్​లర్ల ఎంపికలో సీఎం భగవంత్ మాన్, గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఆప్​ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ బిల్లుపై చర్చ సమయంలో సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ కూడా గత ఏడాది ఇలాంటి బిల్లునే ఆమోదించిందన్నారు. "మేము ఒక యూనివర్సిటీకి వీసీని నియమించలేకపోతే, అది మమ్మల్ని గెలిపించిన ప్రజలకే అగౌరవం అని సీఎం మాన్​ సభలో పేర్కొన్నారు.