
చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుమోపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు ఇంకా నిద్రాణస్థితి నుంచి బయటకు రావడం లేదు. సెప్టెంబర్ 22న చంద్రుడిపై సూర్యోదయమైనప్పటికీ ల్యాండర్, రోవర్‌లు మేల్కొవడం లేదు. రెండు వారాల కిందట జాబిల్లిపై పగటి సమయం మొదలు కావడంతో వీటిని మేల్కొలపడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ క్రమంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చంద్రయాన్-3 ప్రాజెక్టుపై స్పందించారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు మేల్కొలవడంపై ఇక ఆశలు లేవని అన్నారు. భారత్ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్ 3 ప్రాజెక్టు ఇక ముగిసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ల్యాండర్, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదు. ఒక వేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేది. ఇక అవి నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు’’ అని స్పేస్ కమిషన్ మెంబర్ అయిన ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పారు. అయితే దాని నుంచి రావాల్సిన సమాచారం ఇప్పటికే వచ్చేసిందని అన్నారు. చంద్రుడి నమూనాలను భూమికి తీసుకొచ్చే ప్రాజెక్టులు భవిష్యత్తులో ఉంటాయని తెలిపారు .
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు 2023 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువం చేరడంతో ఇస్రో కీర్తి పతాకాల్లో నిలిచింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి.