
షుగర్ అనేది దీర్ఘకాలిక సమస్య. దానికి అంతం లేదు. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, మెడిసిన్ వాడుతూ ఉండాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు అంటున్నారు డాక్టర్ హేమంత్. షుగర్ వ్యాధి అనేది గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న మాటే అయినా, ఇది ఎప్పటి నుంచో ఉంది. విదేశాల్లోనే కాదు, మనదేశంలో కూడా షుగర్ మొదటి నుంచీ ఉంది. కాకపోతే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. మనదేశంలో ఎక్కువగా డయాబెటిస్ రావడానికి గల కారణాల్లో ముఖ్యమైంది జెనెటికల్(జన్యువుల వల్ల). ఆ తర్వాత లైఫ్ స్టైల్లో మార్పులు. ఇంకా ఎక్సర్సైజ్, వెయిట్ మెయింటెయిన్ చేయకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చాలామందికి శారీరక కష్టం ఉండట్లేదు. అలా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ, ప్రధానంగా మాత్రం జన్యుపరంగా డయాబెటిస్ రావడానికి అవకాశం ఎక్కువ.
ఇదంతా ఇలా ఉంటే పదేండ్ల కిందట షుగర్ సరిగా చెక్ చేసుకునేవాళ్లే కాదు. కానీ, ఇప్పుడు అలా కాదు.. షుగర్ ఉన్నవాళ్లు, లేనివాళ్లు అందరూ చెక్ చేసుకునేంత జాగ్రత్త వచ్చింది. చాలామంది జనరల్, సెల్ఫ్, మాసివ్ చెకప్‌లు చేయించుకుంటున్నారు. షుగర్ ఉన్నవాళ్లు చూసుకున్నాక... లేనివాళ్లు కూడా చూసుకుంటున్నారు. అసలు షుగర్ ఎంత ఉండాలంటే ... ఫాస్టింగ్(పరగడుపున)110, పోస్ట్ లంచ్ (తిన్న తరువాత)140 లోపల ఉండాలి.
ఒబెసిటీ వల్ల
ఒబెసిటీ వల్ల కూడా షుగర్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ, ఇది కూడా ఉన్న షుగర్ లెవల్స్‌ని పెంచుతుంది. అంతేకానీ, లేని షుగర్‌ని తీసుకురాదు. వీటిని మెటబాలిక్ డిసీజెస్ అంటారు. ఒబెసిటీలో బీపీ, షుగర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, చాలామంది వెయిట్ తగ్గితే షుగర్ తగ్గుతుందని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. అది చాలావరకు కరెక్టే. ఎలాగంటే... దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. బాడీలో ఇన్సులిన్ సరిగా లేకపోవడం వల్ల షుగర్ వస్తుంది. ఒబెస్ పేషెంట్లలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అదెలాగంటే.. ఒంట్లో ఇన్సులిన్ బాగున్నా కూడా పనిచేయదు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల రెసిస్టెన్స్ మెరుగుపడి షుగర్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ వల్ల క్యాలరీలు తగ్గి, షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దానికంటే ముందు ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. 60 శాతం పనిచేసేది కాస్తా ఎక్సర్సైజ్ చేయడం వల్ల 80–90 శాతం వరకు పనిచేస్తుంది. అప్పుడు షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒబెసిటీ, షుగర్ రెండూ ఉన్నవాళ్లలో ఫ్యాటీ లివర్ లక్షణం కనిపిస్తుంది. కానీ, డైరెక్ట్‌గా షుగర్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరగదు.
అవయవాల మీద...
షుగర్ వల్ల శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతింటాయనేది నిజం. ఎందుకంటే.. షుగర్ ఉండడం వల్ల రక్త నాళాల్లో మార్పులు వస్తాయి. కొలెస్ట్రాల్ వంటివి ఉన్నప్పుడు అవి కనిపిస్తాయి. శరీరంలోని ఏ అవయవాల(ఆర్గాన్స్) మీద అయితే ఈ మార్పులు ఉంటాయో ఆ భాగం ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా వైటల్ ఆర్గాన్స్ అంటే.. కళ్లు, మెదడు, గుండె, కిడ్నీ. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా ఈ అవయవాలపై దెబ్బ పడుతుంది. కాబట్టి బీపీ, షుగర్లను కంట్రోల్ చేయమని చెప్తారు. వీటితోపాటు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు కాళ్లు, వేళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దాంతో వాటంతటవే ముడుచుకు పోతాయి. పుండ్లు పడతాయి. దీనికి కారణాలు.. రక్తనాళాలు, మెదడు నుంచే నరాలు దెబ్బతినడం వల్ల స్పర్శ తగ్గుతుంది. మామూలుగా చాలామంది చేసే తప్పేంటంటే నొప్పి ఉంటేనే పట్టించుకుంటారు. అయితే స్పర్శ లేకపోవడం వల్ల పుండు పడినా, చీము కారినా పట్టించుకోరు. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ తీవ్రం అవుతుంది. శరీరావయవాలు ఎఫెక్ట్ అవ్వడానికి ఇవే ముఖ్య కారణాలు.
కళ్ల మీద ఉంటుంది
షుగర్ ఉంటే కళ్లకూ దెబ్బే. రెటీనా మీద ఆ ప్రభావం పడుతుంది. అందుకే దీన్ని రెటినోపతి అంటారు. ఇదెలా జరుగుతుందంటే.. రెటీనాలో కూడా రక్త నాళాలు ఉంటాయి. వాటిల్లో మార్పులు రావడం వల్ల కళ్లకు దెబ్బ. అందుకే షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే పది లేదా పదిహేనేండ్లు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో అప్పుడు దాని ప్రభావం కనిపిస్తుంది. చాలారోజుల నుంచి షుగర్ ఉన్నవాళ్లకు ఎప్పటికైనా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది.
నోటి ఆరోగ్యం
షుగర్ వల్ల నోటి ఆరోగ్యం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాకపోతే ఇలాంటి కేసులు చాలా అరుదు. షుగర్ అదుపులో ఉండని వాళ్లలో, షుగర్ రేంజ్400 లేదా 500 ఉన్నవాళ్లలో ఇది కనిపిస్తుంది. వాళ్లకి నోట్లో, అన్నవాహికలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే చెవిలో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
కిడ్నీ భద్రం
డయాబెటిస్ ఉన్నవాళ్లలో కిడ్నీల పనితీరులో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కిడ్నీల్లో గ్లోమెరులార్ ఫిల్టరేషన్ సరిగా జరగదు. అంటే కిడ్నీల్లో గ్లోమెరులై అనేది ఉంటుంది. అందులో ఫిల్టర్స్ అనేవి ట్యూబ్స్లా ఉంటాయి. షుగర్ ఉన్నప్పుడు ఆ ఫిల్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ప్రొటీన్స్ పోతాయి. ఈ స్థితిని త్వరగా గుర్తిస్తే కిడ్నీలు దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు. కిడ్నీలు దెబ్బతినడాన్ని నెఫ్రోపతి అంటారు.
కొంతకాలం ఆపొచ్చు
ఇన్సులిన్ సరిగా విడుదల కాకపోవడంతో షుగర్ కంట్రోల్ కాదు. అప్పుడు రక్త నాళాల్లో మార్పులు జరుగుతాయి. చివరికి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే, రక్త నాళాల్లో బ్లాక్స్ వల్ల వల్ల ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఏ అవయవం మీద ఎక్కువ ఎఫెక్ట్ పడితే ఆ అవయవం దెబ్బతింటుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే షుగర్‌ని కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే మార్గం. అప్పుడు చాలావరకు హెల్త్‌ని కాపాడుకోవచ్చు.
ఒత్తిడి తగ్గించుకోవాలి
ఒత్తిడి పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే ఒత్తిడి వల్ల డయాబెటిస్ రాదు. అప్పటికే డయాబెటిస్ ఉన్న వాళ్లలో ఒత్తిడి ఎక్కువైతే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. షుగర్ పేషెంట్‌కి సడెన్‌గా ఒక బ్యాడ్ న్యూస్ లేదా ఎమోషనల్ అయ్యే విషయాలు చెప్తే షుగర్ పెరిగే అవకాశం ఉంది. అప్పటివరకు చాలాకాలం షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉండి, ఒక్కసారిగా పెరగడం అనేది అరుదు. ఈ కండిషన్‌ని కీటో ఎసిడోసిస్ అంటారు. దీనివల్ల షుగర్ లెవల్స్‌లో తేడా కనిపిస్తుందే తప్ప ఆర్గాన్స్ ఎఫెక్ట్ కావు. ఎక్కువ కాలం ఎక్కువ షుగర్ లెవల్స్ ఉండడం వల్ల మాత్రమే ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. షుగర్ ఉందని చాలామంది దిగులుపడతారు. దానివల్ల ఎక్కువ ఆలోచించడం, ఒత్తిడి పెరగడం వంటివి ఉంటాయి. వీళ్లలో కూడా రెండు రకాల వాళ్లు ఉంటారు. కొందరు అస్సలు పట్టించుకోరు. చివరి నిమిషం వరకు నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు షుగర్ ఉందని తెలిసినప్పట్నించీ యాంగ్జైటీ, డిప్రెషన్ బారిన పడతారు. ప్రతి ఒక్కరూ కొన్ని రోజులు దాని గురించే ఆలోచిస్తుంటారు. ఎందుకు వచ్చింది? అని బాధపడతారు. అంత ఎక్కువగా ఆలోచించకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
హెచ్‌బిఎ1సి రేంజ్
హెచ్‌బిఎ1సి రేంజ్‌కీ, షుగర్ లెవల్స్కీ సంబంధం లేదు. ఇది కేవలం షుగర్ పర్సంటేజ్ని చూపిస్తుంది. షుగర్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయించుకోవద్దు. అప్పటికే ఉన్నవాళ్లకు షుగర్ ఎంత కంట్రోల్లో ఉందో యావరేజ్‌గా తెలుస్తుంది. అంతేకానీ, కన్ఫర్మ్ చేసుకోవాలంటే పరగడుపున బ్లడ్ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్‌లో 6 కంటే తక్కువ ఉంటే షుగర్ లేనట్టు.7కంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్టు. అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ అదుపులో లేనట్టు. అలాగే ఇందులో పర్సంటేజ్ తెలుసుకోవడానికి టైం పెట్టుకోవాల్సిన అవసరంలేదు. ఈ టెస్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇందులో చూసుకుని 6.1 రాగానే షుగర్ వచ్చింది అనుకుంటున్నారు. ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్లకు ఇది నార్మల్ రేంజ్.
రివర్స్ చేయలేం
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయొచ్చు. కానీ, రివర్స్ చేయలేం. ఎందుకంటే దానికి ఇప్పటివరకు విరుగుడు మందు అనేదే లేదు. ఇప్పుడు వాడుతున్న మందులు, తీసుకునే ఫుడ్... ఇవన్నీ కూడా కేవలం కంట్రోల్ చేయడం వరకే. షుగర్ కంట్రోల్ చేయాలంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. అది వీలుపడకపోతే వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటివి చేయొచ్చు. తక్కువ సేపు కూర్చోవాలి. కానీ, ఈరోజుల్లో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా పది గంటలకు పైనే కూర్చోవాల్సివస్తుంది. ఐటీ వాళ్లైతే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయ్యేంతవరకు కూర్చునే ఉంటారు. అది 12 లేదా 15 గంటలైనా గానీ. అన్ని గంటలు పని ఒత్తిడి ఉండటం వల్ల బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్ వంటివి త్వరగా వస్తున్నాయి. అందుకనే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్, ఎనిమిది గంటలు నిద్ర అనేది తప్పనిసరి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఫుడ్ విషయానికొస్తే, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఆకు కూరలు, పండ్లు, సలాడ్స్ ఎక్కువగా తినాలి. వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. కానీ, ఈ రోజుల్లో వాటిని దూరం పెట్టడం చాలామందికి సాధ్యం కావట్లేదు. కాబట్టి, రోజూ కాకుండా వారానికి ఒకటి లేదా రెండు సార్లు తినడం బెటర్. ఆలుగడ్డ తప్పించి దాదాపు అన్నీ తినొచ్చు. దుంప రకాలు కాస్త తక్కువగా తినాలి. పండ్లలో జామ, యాపిల్, కమల, బత్తాయి, బొప్పాయి, పుచ్చకాయ తినొచ్చు.
ముందు జాగ్రత్త ఉండాలి
ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉందంటే తప్పకుండా తర్వాతి జనరేషన్‌కి వస్తుంది. కాబట్టి వస్తుందని తెలిసినప్పుడు ముందే జాగ్రత్త పడడం మంచిది. ఎక్సర్సైజ్, ఫుడ్ వంటివి సరిగా చేస్తే కంట్రోల్లో ఉంటుంది.పూర్తిగా రాకుండా ఆపలేం. కానీ, కొన్నాళ్లు పోస్ట్‌పోన్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా లైఫ్ స్టైల్ అలాగే కంటిన్యూ చేస్తే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇరవై ఏండ్లు దాటితే షుగర్ కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.
– డాక్టర్ సి.హెచ్. హేమంత్
కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్