ఇంటర్మీడియెట్ అకడమిక్  ఇయర్​ క్యాలెండర్ లో మార్పులు

ఇంటర్మీడియెట్ అకడమిక్  ఇయర్​ క్యాలెండర్ లో మార్పులు
  • మార్చిలో ప్రాక్టికల్స్.. మారనున్న అకడమిక్ ఇయర్​ క్యాలెండర్
  • గతంలో ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్.. మార్చిలో ఎగ్జామ్స్ అని ప్రకటన 
  • క్లాసులు సరిగ్గా జరక్కపోవడంతో షెడ్యూల్​లో మార్పులకు చర్యలు


హైదరాబాద్, వెలుగు:  కరోనా వల్ల ఇంటర్మీడియెట్ అకడమిక్  ఇయర్​ క్యాలెండర్ లో మార్పులు జరగనున్నాయి. షెడ్యూల్​ ప్రకారం ఫిబ్రవరిలో ప్రాక్టికల్​ ఎగ్జామ్స్, మార్చిలో పబ్లిక్​ ఎగ్జామ్స్ ఉంటాయని గతంలో ప్రకటించినా.. ఇప్పుడు అందులో మార్పులు చేయనున్నట్లు ఇంటర్​ బోర్డు అధికారులు చెప్తున్నారు. కరోనా వల్ల క్లాసులు సరిగ్గా జరగకపోవడం, సెలవులు పెరగడంతో మార్చిలో ప్రాక్టికల్స్, మే ఫస్ట్​ వీక్​లో పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టాలని భావిస్తున్నారు. 

సర్కారు నుంచి ఆమోదం రాగానే ప్రకటన

ఫిబ్రవరిలో జరగాల్సిన ప్రాక్టికల్స్​ను మార్చి లో పెట్టాలని, పబ్లిక్ ఎగ్జామ్స్​ కూడా మే ఫస్ట్ వీక్​లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సర్కారు ఆమోదం పొందితే, అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మధ్య సెకండియర్  స్టూడెంట్లకు  ఫస్టియర్ పరీక్షలు పెడితే సగం మంది కూడా పాస్  కాలేదు. దీంతో కొందరు స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్​ బోర్డు నిర్వాకం వల్లే స్టూడెంట్లు చనిపోయారని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఫిజికల్ క్లాసులకు మరింత టైమ్ ఇవ్వాలని సర్కారు కూడా భావిస్తున్నది. స్టూడెంట్లు ఎగ్జామ్స్​కు ప్రిపేర్ అయ్యేందుకూ మరింత సమయం పెంచాలని యోచిస్తున్నది. ఈ క్రమంలోనే  పరీక్షా విధానంలోనూ మార్పులు చేయాలని   సర్కారు నిర్ణయించింది. అన్ని సబ్జెక్టుల్లో చాయిస్​లను మరిన్ని పెంచాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. దీంతో ఈ ఏడాది కొత్త ఎగ్జామ్ మోడల్ పేపర్​లను  త్వరలోనే అధికారులు రిలీజ్ చేయనున్నారు. 

లాస్ట్​ వర్కింగ్​ డే మారొచ్చు

2021–22  ఇంటర్​ అకడమిక్ ఇయర్​లో మొత్తం 220 వర్కింగ్ డేస్ ఉంటాయని, ఏప్రిల్ 13 లాస్ట్ వర్కింగ్ డే అని సెప్టెంబర్​లో ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ పేర్కొన్నారు. అయితే.. జనవరిలో కరోనా థర్డ్​ వేవ్​ వల్ల 24 రోజులు సెలవులు వచ్చాయి. దీంతో అనివార్యంగా షెడ్యూల్ మారనుంది. రాష్ట్రంలో మొత్తం 2,500 కాలేజీలుండగా, వాటిలో 9.5 లక్షల మంది ఇంటర్ స్టూడెంట్లున్నారు. వీరందరికీ ఫిబ్రవరి10 నుంచి ప్రీఫైనల్ ఎగ్జామ్స్, 23 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్,  మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకూ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయని గతంలో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఇవేవీ జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికీ  ఎగ్జామ్స్​ ఫీజు గడువే ఇంకా  ముగియలేదు. ఈ నెల 4 వరకు ఫైన్​లేకుండా ఫీజు చెల్లించే అవకాశముంది. లాస్ట్​ వర్కింగ్​ డే కూడా మారే చాన్స్​ ఉంది.