తెలుగోళ్లను తెలుగోళ్ల చేతనే మోసం చేయించిన జార్ఖండ్ వాసి

తెలుగోళ్లను తెలుగోళ్ల  చేతనే మోసం చేయించిన జార్ఖండ్ వాసి
  • తెలుగు వాళ్లను తెలుగు వారి చేతనే మోసం చేయించిన సైబర్​ నేరగాడు
  •  9 మందిని జార్ఖండ్​ తీసుకెళ్లి.. అక్కడి నుంచి తెలివిగా ఆపరేషన్
  • కమీషన్ వస్తుందని సైబర్​ నేరాలకు పాల్పడిన వనపర్తి జిల్లా యువకులు
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలుగు వాళ్లను మోసం చేసేందుకు తెలుగు మాట్లాడే యువకులనే ఎరగా వాడుకున్నాడు జార్ఖండ్​కు చెందిన ఓ సైబర్ నేరగాడు. రాష్ట్రం నుంచి 9 మందిని జార్ఖండ్​కు తీసుకువెళ్లి.. వారికి కమీషన్లు ఇస్తూ.. వారితో సైబర్ ​నేరాలు చేయించాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ ​క్రైమ్ ​పోలీసులు జార్ఖండ్ లోని ధన్‌‌‌‌‌‌‌‌బాద్‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా జరుగుతున్న గ్యాంగ్​ను ట్రేస్​చేసి, శుక్రవారం 9 మందిని అరెస్ట్​ చేశారు. నిందితులంతా వనపర్తి జిల్లా పెద్ద మందడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు వివరాల ప్రకారం.. పెద్దమందడికి చెందిన కట్రవత్‌‌‌‌‌‌‌‌ రాజు(27) హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆటో నడిపేవాడు. రెండేండ్ల క్రితం జార్ఖండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన సైబర్ నేరగాడు విక్రమ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వచ్చాడు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాజు ఆటోను ఎంగేజ్‌‌‌‌‌‌‌‌ చేసుకునేవాడు. పరిచయం పెంచుకున్న అతను.. బ్యాంక్ లోన్స్, ఫైనాన్స్ సర్వీసెస్ పేరుతో డబ్బులు సంపాదించవచ్చని చెప్పాడు. తనతో వచ్చి పనిచేస్తే వచ్చిన మొత్తంలో 30 శాతం కమిషన్ ఇస్తానన్నాడు. స్పష్టమైన తెలుగులో మాట్లాడే ఇంకొందరిని తీసుకురావాలని చెప్పాడు. దీంతో  రాజు తన ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ కట్రవత్‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌ (21), హరిలాల్‌‌‌‌‌‌‌‌(19), గణేశ్(19), ఎస్లావత్‌‌‌‌‌‌‌‌ గణేశ్(21), మధువత్ వెంకటేశ్(18), కేతవత్‌‌‌‌‌‌‌‌ రాజు(21), దెగావత్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసులు(22), మధువత్‌‌‌‌‌‌‌‌ గణేశ్(19)తో కలిసి డిస్కస్ చేశాడు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చని వారికి చెప్పాడు. వీళ్లంతో కలిసి విక్రమ్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పిన విధంగా నిరుడు జనవరిలో జార్ఖండ్​లోని ధన్‌‌‌‌‌‌‌‌బాద్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. రాజుతో పాటు వెళ్లిన 8 మందికి విక్రమ్ షెల్టర్ ఇచ్చాడు. వివిధ కంపెనీల సిమ్‌‌‌‌‌‌‌‌కార్డ్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి వాటి ద్వారా తెలుగు వారి ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌కి కాల్స్ చేయించాడు. ఇలా వీళ్లు తెలుగు, హిందీలో మాట్లాడుతూ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ లోన్స్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్స్ సర్వీసెస్ అందిస్తామంటూ ట్రాప్ చేయడం ప్రారంభించారు. ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. ఏడాది కాలంగా వరుస మోసాలకు పాల్పడుతున్నారు. వచ్చిన దాంట్లో విక్రమ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్ ఇచ్చిన కమీషన్‌‌‌‌‌‌‌‌తో సొంతూరికి వచ్చి ఎంజాయ్ చేసేవారు. 

మూడు కేసుల దర్యాప్తుతో..
రాచకొండ సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌లో నమోదైన 3 కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. ఫోన్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ ధన్‌‌‌‌‌‌‌‌బాద్‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. విక్రమ్ ఠాకూర్ షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి సెర్చ్ చేశారు. రాష్ట్రానికి చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రయత్నించగా లోకల్​ పోలీసులు సహకరించలేదు. స్థానిక  కోర్టు ఆర్డర్స్ లేనిదే విక్రమ్‌‌‌‌‌‌‌‌ను అప్పగించమని వారు చెప్పారు. దీంతో తొమ్మిది మందిని ట్రాన్సిట్‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌పై హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తరలించారు. ఇదే గ్యాంగ్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్రవ్యాప్తంగా మరో11 కేసులు రిజిస్టర్ అయినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.