జీహెచ్ ఎంసీ లో అక్రమాలకు చెక్!

జీహెచ్ ఎంసీ లో అక్రమాలకు చెక్!
  • జీహెచ్ ఎంసీ లో అక్రమాలకు చెక్!
  • డీసీ, జెడ్ సీలకు విజువల్ ఇన్ స్పెక్షన్ బాధ్యతలు రద్దు
  • ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్  
  • పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంపై అలెర్ట్
  • ఇన్ స్పెక్షన్ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గుర్తింపు

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీలో పలువురు అధికారుల అక్రమాలకు చెక్ పడింది. డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు విజువల్ ఇన్ స్పెక్షన్ బాధ్యతలు రద్దు చేస్తూ కమిషనర్ లోకేశ్​ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మొన్నటి వరకు డిప్యూటీ కమిషనర్లు రూ.10 లక్షలలోపు పనులు, అంతకు మించితే జోనల్ కమిషనర్లు విజువల్  ఇన్ స్పెక్షన్ చేయాల్సి ఉండేది. ఇటీవల గోషామహల్ డీసీతోపాటు పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిషనర్ గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. వాస్తవాలను గుర్తించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాంట్రాక్టర్ల నుంచి డబ్బుల డిమాండ్

పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి గల కారణాలపై కమిషనర్ దృష్టిపెట్టారు. విజువల్ ఇన్​స్పెక్షన్ పేరుతో డీసీ, జోనల్ కమిషనర్లు నెలల తరబడి బిల్లులు పెండింగ్ లో పెడుతున్నట్లు గుర్తించారు. బిల్లులపై 0.5 నుంచి ఒక శాతం డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తూ.. ఆ డబ్బులు ఇచ్చేంత వరకు  ఇన్ స్పెక్షన్ పూర్తి చేయడంలేదని తెలుసుకున్నారు. ఇలా ముగ్గురు జోనల్ కమిషనర్లతో పాటు పలువురు డీసీలు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. కాంట్రాక్టర్లు కూడా ఈ అంశంపై గత రెండేళ్లుగా కమిషనర్ కి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.  దీంతో ఈ తరహా అక్రమాలకు చెక్ పెట్టేందుకు కమిషనర్ విజువల్  ఇన్ స్పెక్షన్ ను రద్దు చేశారు.  ఇన్ స్పెక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చని, కానీ విజువల్  ఇన్ స్పెక్షన్  పేరుతో బిల్లులను ఆపే అధికారాలను తొలగించడంతో వారి అక్రమాలకు చెక్ పడినట్లయ్యింది. ఈ నిర్ణయంతో కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. 

క్వాలిటీ కంట్రోల్  ఇన్ స్పెక్షన్ తోనే ఫైనల్

జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించి క్వాలిటీని నలుగురు చెక్ చేసిన తర్వాత డీసీలు, జోనల్ కమిషనర్లు విజువల్ ఇన్ స్పెక్షన్ చేసేవారు. ముందుగా జీహెచ్ఎంసీ ఏఈ, డీఈ, ఈఈ లు ఫస్ట్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు. జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ విభాగం సెకండ్ పార్టీ కింద చెక్​ చేస్తే, థర్డ్ పార్టీ కింద ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన ప్రొఫెసర్లు, ఫోర్త్ పార్టీ కింద బల్దియా ఫిక్స్ చేసిన ఏజెన్సీలు(ఎన్​ఏబీఎల్) క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తాయి. వీరి తర్వాత చివర్లో జరిగే విజువల్  ఇన్ స్పెక్షన్ కారణంగా కాంట్రాక్టర్లకు మూడు నెలలకిపైగా బిల్లులు పెండింగ్ పడుతున్నాయి. దీంతో వీరిని ఈ బాధ్యతల నుంచి తొలగించారు.

అన్నింట్లోనూ కమీషన్లే..

 గ్రేటర్ పరిధిలో రోడ్లు, బిల్డింగ్స్​ తదితర నిర్మాణాలు ఏవి చేపట్టినా కూడా మొన్నటి వరకు విజువల్ ఇన్ స్పెక్షన్ తప్పనిసరి చేయాల్సి ఉండేది. ఇందుకోసం నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ లో ఉండేవి. ఇదే అదునుగా అధికారులు కాంట్రాక్టర్లని డబ్బులు డిమాండ్ చేసేవారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు చేసినా కాంట్రాక్టర్లకు బిల్లులు అందేవి కాదు. దీంతో  విజువల్  ఇన్ స్పెక్షన్​ లేకుండా బిల్లులు అందించాలని కాంట్రాక్టర్ అసోసియేషన్ రెండేళ్లుగా కమిషనర్ ను కోరుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తో అసోసియేషన్​లో ఆనందం వ్యక్తమవుతోంది. 

కమిషనర్ కు ధన్యవాదాలు

విజువల్ ఇన్ స్పెక్షన్ లేకుండా బిల్లులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న కమిషనర్ కు థాంక్స్. ఇకపై కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా అందేందుకు వీలుంటుంది. వారికి వెంటనే బిల్లులు వస్తే వేరే పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. 

–సురేందర్ సింగ్, కాంట్రాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ 

అధికారులు కాజేస్తున్నరు

అధికారులు ఎక్కడ వీలుంటే అక్కడ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో అధికారుల అక్రమాలకు కాస్త కళ్లెం పడనుంది. ఫ్యూచర్ లో కమీషన్లు, లంచాలు లేకుండా ఉండేలా కమిషనర్ మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలె. 

–అబ్దుల్ రహేమాన్, సోషల్ యాక్టివిస్ట్