ఫోన్ మోసాలకు చెక్.. 64 లక్షల దొంగ కనెక్షన్లు కట్

ఫోన్ మోసాలకు చెక్.. 64 లక్షల దొంగ కనెక్షన్లు కట్

బిజినెస్​ డెస్క్, వెలుగు: ఫేషియల్​రికగ్నిషన్​ టెక్నాలజీ సాయంతో 64 లక్షల మోసపూరిత ఫోన్​ కనెక్షన్లను ప్రభుత్వం గత ఆరు నెలల్లో కట్​చేసింది. మోసపూరిత ఉద్దేశాలతో తీసుకున్న సిమ్​కార్డులను గుర్తించడానికి ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​ అండ్​ ఫేషియల్​రికగ్నిషన్​ పవర్డ్​ సొల్యూషన్ (ఏఎస్​టీఆర్​– ఇదొక టెక్నాలజీ టూల్)ను డిపార్ట్​మెంట్​ఆఫ్​ టెలికం అందుబాటులోకి తెచ్చింది. 

సెంటర్​ ఆఫ్​ డెవలప్​మెంట్​ ఆఫ్​ టెలిమాటిక్స్(సీ–డాట్) సాయంతో డాట్​ ఈ టూల్​ను డెవలప్​ చేయగలిగింది. అనుమతించిన దానికంటే ఎక్కువ సిమ్​ కార్డులు పొందేందుకు  ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువసార్లు  ప్రయత్నిస్తే,  ఫొటో ఆధారంగా అలాంటి వ్యక్తులను ఈ టెక్నాలజీ టూల్ గుర్తిస్తుంది. ఒక వ్యక్తి తన ఆధార్​కార్డుతో 9 సిమ్​ కార్డులను మాత్రమే తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది.  కానీ, కొన్ని సందర్భాలలో ఒకే వ్యక్తి తన ఆధార్​కార్డుతో వందలలో కాదు ఏకంగా వేల సంఖ్యలోనే సిమ్​ కార్డులను తీసుకున్నట్లు సీ–డాట్​ సొల్యూషన్​ ఏఎస్​టీఆర్​ కనుక్కుంది. కొవిడ్​–19 తర్వాత కాలంలో ఫేషియల్​ రికగ్నిషన్​ టెక్నాలజీ వాడకం అటు గవర్నమెంటు, ఇటు ప్రైవేటు సంస్థలలోనూ బాగా పెరిగింది. 

సరైన డేటా ప్రొటెక్షన్​ ఫ్రేమ్​వర్క్​లు అందుబాటులో లేకపోవడంతో ఈ వాడకం కొన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. పెద్ద పెద్ద డేట్​బేస్​ల ప్రాసెసింగ్​కు తగిన మెకానిజం తేలేకపోవడమూ ఒక సవాలుగా మారింది. ఆగస్టు 2023 లో ఆమోదం పొందిన డిజిటల్​ పర్సనల్​ డేటా ప్రొటెక్షన్​ యాక్ట్​ దేశంలో అమలులోకి తేవాల్సి ఉంది. ఎవరైనా వ్యక్తి అనుమతికి మించి కనెక్షన్లు తీసుకున్నారా అనే అంశాన్ని ఫేషియల్​ రికగ్నిషన్​ అల్గారిథమ్​ కనుగొంటుంది. ఫోన్​ రిజిస్ట్రేషన్​ డేటాబేస్​తో సరిపోల్చడం ద్వారా ఆ సొల్యూషన్​ పనిచేస్తుంది. 

దేశంలోని 140 కోట్ల మందితో కూడిన పూర్తి డేటా బేస్​ను ఇందుకోసం వినియోగిస్తున్నట్లు సీ–డాట్​ సీఈఓ రాజ్​కుమార్​ ఉపాధ్యాయ్​ చెప్పారు. ఇదొక క్లిష్టమైన ప్రక్రియేనని, ఇంతదాకా ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద డేటాబేస్​ను ఒకేసారి ప్రాసెస్​ చేస్తున్న దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు ఎక్కువ సిమ్​ కార్డులు పొందేందుకు  రిజిస్ట్రేషన్​ సమయంలో  తమ మొహాన్ని దాచుకునే ప్రయత్నాలను   చేసినట్లు ఉపాధ్యాయ్​ వివరించారు.  అయితే, అలా మొహాన్ని దాచుకుని ప్రయత్నించే వ్యక్తులను సైతం వారి ఫొటోలలోని పోలికల ద్వారా గుర్తించగలుగుతున్నామని వెల్లడించారు. దీనిని ఫేషియల్​ వెక్టర్​గా వ్యవహరిస్తారని, ప్రతి వ్యక్తికి యూనిక్​ ఫేషియల్​ వెక్టార్​ ఉంటుందని చెప్పారు. 

తన మొహాన్ని తెలియకుండా దాచుకునే ప్రయత్నం చేసినా, ఆ  వ్యక్తి పెదవులు, కళ్లు వంటి వెక్టార్లు మారవని వివరించారు. ఇదే తరహా ఫేషియల్​ వెక్టార్​ ఉండే వ్యక్తులను తమ అల్గారిథమ్ గుర్తిస్తుందని, ఫలితంగా ఎక్కువ సిమ్​లను తీసుకున్న వ్యక్తులు బయటపడతారని సీ–డాట్​ సీఈఓ పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్​ కార్డులు మాత్రమే తీసుకునే వీలుంది. కానీ, కొన్ని సందర్భాలలో ఆయా సిమ్​లతో  ఒకే వ్యక్తి ఫొటో 1,000– 2,000 సార్లు ఉండటాన్ని కనుక్కోగలిగామని వెల్లడించారు. 

మోసాలు చేసేందుకే ఎక్కువ సిమ్​కార్డులు..

సైబర్​ మోసాలు చేసే ఉద్దేశంతోనే ఇలా ఎక్కువ సిమ్​లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఉపాధ్యాయ్​ చెప్పారు. ఫేక్​ కస్టమర్ ఏజంట్లుగా వ్యవహరిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో ఇలాంటి మోసాల సంఖ్య భారీగా పెరిగిపోయిందని అన్నారు. దేశంలో సైబర్​ మోసగాళ్ల వలలో చిక్కుకున్న వారి సంఖ్య లక్షలలోకి చేరుకుందని వివరించారు. ఏఎస్​టీఆర్​ వాడి అలాంటి కేసులను గుర్తించాక టెలికం కంపెనీలకు ఆ వివరాలను తెలియచేస్తారు. అప్పుడు కేవైసీ రుజువులు ఇమ్మని  ఆ వ్యక్తులకు నోటీసులు జారీ అవుతాయి. 

60 రోజుల తర్వాత ఆ వ్యక్తుల నుంచి సరైన సమాధానం రాకపోతే, అధికారులు ఆ  కనెక్షన్ల​ను కట్ చేస్తారు. అంతేకాదు, బల్క్​లో సిమ్​ కార్డులను అలాంటి మోసపూరిత వ్యక్తులకు అమ్మే షాపులపైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి షాపుల వారి సాయం లేకుండా ఎక్కువ సంఖ్యలో సిమ్​ కార్డులు పొందడం సులభమేమీ కాదని, అందుకే వారి పైనా చర్యలు తప్పవని ఉపాధ్యాయ్‌‌ అన్నారు.

మోసపూరిత సిమ్​ల వాట్సాప్​ ప్రొఫైల్సూ గమనిస్తున్నాం

మోసపూరితంగా తీసుకునే సిమ్​కార్డులు, నెంబర్లను గుర్తించేందుకు ఆయా వాట్సాప్​ ప్రొఫైల్స్​ను కూడా చూస్తున్నట్లు సీ–డాట్​ సీఈఓ రాజ్​కుమార్​ ఉపాధ్యాయ్​ చెప్పారు. మోసాలు చేయడానికి తీసుకునే సిమ్​ కార్డులను కొంత కాలం వాడిన  తర్వాత కాల్చేస్తుండటాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. కానీ, మోసగాళ్లు ఆ తర్వాత కూడా వాట్సాప్​ను డీ–యాక్టివేట్​ చేయకుండా ​ అదే ప్రొఫైల్​తో కొనసాగుతుండటాన్ని కనుక్కున్నట్లు వివరించారు. 

వాట్సాప్​ రిజిస్ట్రేషన్​కు ఒక్కసారి మాత్రమే సిమ్​ కార్డు అవసరం ఉంటుందని ఉపాధ్యాయ్​ ప్రస్తావించారు. 2023 మొదటి నుంచీ వాట్సాప్​ ద్వారా స్కామర్లు లక్షల మంది అమాయకులకు వల వేస్తున్నారని, దీంతో వారి వాట్సాప్​ ప్రొఫైల్స్​ సైతం డీ–యాక్టివేట్​ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.