భువనగిరి జిల్లాలో...ఫార్మా కంపెనీల కాలుష్యంపై తనిఖీ చేయండి : ఎంపీ చామల

భువనగిరి జిల్లాలో...ఫార్మా కంపెనీల కాలుష్యంపై తనిఖీ చేయండి : ఎంపీ చామల
న్యూఢిల్లీ, వెలుగు: భువనగిరి జిల్లాలో ఫార్మా, రసాయన పరిశ్రమల ద్వారా జరుగుతున్న భూగర్భ, గాలి, నీటి కాలుష్యంపై నిపుణుల కమిటీతో సమగ్రమైన, నిష్పక్షపాతమైన తనిఖీ నిర్వహించాలని ఎంపీ చామల కిరణ్ కుమర్ రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీలో సీపీసీబీ, ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన సైంటిస్టులను నియమించాలన్నారు. భువనగిరి లోక్​సభ నియోజకవర్గంలో ఫార్మా, రసాయన పరిశ్రమల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం లోక్ సభలో లేవనెత్తారు. 

సుమారు 10–15 రసాయన పరిశ్రమలు కాలుష్య కారకాలను విడుదల చేస్తున్నాయని సభ దృష్టికి తెచ్చారు. వీటి కారణంగ భూగర్భ జలాలు, గాలి, భూమి కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కంపెనీలను రాజ్య సభకు చెందిన ఒక ఎంపీ, కార్పొరేట్ సంస్థలు నడిపిస్తున్నాయని వివరించారు. దురదృష్టవశాత్తు ఈ ఫార్మా కంపెనీలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కాలుష్య రహిత జాబితాలో చేర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్.. రాష్ట్రంలో తలెత్తే కాలుష్యంపై ప్రాథమికంగా స్టేట్ కంట్రోల్ బోర్డులే చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు.