పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు.. భారీగా బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు.. భారీగా బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం
  • హైదరాబాద్ నుంచి మధురై తరలిస్తుండగా పట్టివేత

కర్నూలు: పంచలింగాల చెక్ పోస్టు వద్ద  పోలీసుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్రమ మద్యం రవాణాను నివారించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో సోదాల సందర్భంగా ప్రతిరోజూ అక్రమ రవాణాదారులు పట్టుపడుతూనే ఉన్నా స్మగ్లింగ్ ఆగడం లేదు. మరీ ఆశ్చర్యకరంగా కోట్ల రూపాయల విలువైన బంగారు,వజ్రాభరణాలను యధేచ్చగా అక్రమంగా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్‌మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గౌతమి షాలి పర్యవేక్షణలో ఎస్.ఈ.బీ(SEB)టీం, లోకల్ పోలీసుల సమన్వయంతో సీఐ లక్ష్మి దుర్గయ్య వారి సిబ్బంది బుధవారం ఉదయం తనిఖీలు చేయగా రూ.1.04 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు పట్టుపడ్డాయి. హైదరాబాద్‌ నుంచి వీటిని మధురై తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్నట్లు గుర్తించారు. బంగారం, ఆభరణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.