మాండౌస్ తుఫాన్​తో భారీ నష్టం

మాండౌస్ తుఫాన్​తో భారీ నష్టం
  • వరదలకు ఇండ్లు, షాపులు ధ్వంసం
  • నేలకూలిన 400 చెట్లు,  కరెంట్ స్తంభాలు 
  • తమిళనాడు వ్యాప్తంగా వర్షాలకు ఐదుగురు మృతి 

చెన్నై: మాండౌస్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని చెన్నై అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. సిటీలో చాలాచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. మాండౌస్ తుఫాన్ శుక్రవారం అర్ధరాత్రి 1:30 గంటలకు మహాబలిపురం వద్ద తీరం దాటింది. ఆ టైమ్ లో 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. వీటి ధాటికి చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఆగమాగమయ్యాయి. సిటీలో దాదాపు 400 చెట్లు నేలకూలాయి. చెట్లు పడి, గోడలు కూలి కార్లు ధ్వంసమయ్యాయి. ఎగ్మూర్ ఏరియాలో పెద్ద చెట్టు కూలి పెట్రోల్ బంక్ పై పడింది. కొన్నిచోట్ల చెట్లు కూలి కరెంట్ స్తంభాలు విరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మెరీనా, కోవలం బీచ్ లలో సముద్రం ఉప్పొంగి బోట్లు, షాపులు కొట్టుకుపోయాయి. తుఫాన్ తీరం దాటినప్పటికీ చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని చెప్పింది.

స్కూళ్లు, ఫ్లైట్లు బంద్.. 

తుఫాన్ ప్రభావంతో చెన్నై ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 30 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలను క్యాన్సిల్ చేశారు. చెన్నైకి రావాల్సిన 21 విమానాలను వేరే సిటీలకు దారి మళ్లించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా శనివారం కూడా స్కూళ్లకు సెలవు ఇచ్చారు. యూనివర్సిటీల్లో ఎగ్జామ్స్ వాయిదా వేశారు.

ఏపీలోనూ భారీ వర్షాలు 

తుఫాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ఇండ్లలోకి వరద చేరింది. తిరుపతిలోని నాయుడుపేటలో అత్యధికంగా 28సెం.మి., చిత్తూరులోని కేవీబీ పురంలో 25 సెం.మి. వర్షపాతం నమోదైంది. పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

205 క్యాంపుల్లో 9 వేల మందికి ఆశ్రయం..

వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు చనిపోయారని సీఎం స్టాలిన్ తెలిపారు. 100 ఆవులు చనిపోయాయని, 181  ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. శనివారం రాయపురం జిల్లాలోని కాసిమేడులో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ముప్పును ముందే ఊహించి, నివారణ చర్యలు చేపట్టడంతో నష్ట తీవ్రత తగ్గిందని స్టాలిన్ తెలిపారు. రోడ్లమీద విరిగిపడిన చెట్లు, కరెంట్ స్తంభాలను సిబ్బంది తొలగిస్తున్నారని చెప్పారు. 25 వేల మంది మున్సిపల్ కార్మికులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది ఈ పనులు చేస్తున్నారని వెల్లడించారు. చెన్నై పక్కనున్న చెంగల్ పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లోనూ సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. మొత్తం 600 ప్రాంతాల్లో కరెంట్ కట్ కాగా, 300 ప్రాంతాల్లో రిపేర్లు చేశామని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో వర్క్ జరుగుతోందని చెప్పారు. 205 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, 9 వేల మందికి ఆశ్రయం కల్పించామ ని వెల్లడించారు. తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేశామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సాయం కోరతామని సీఎం స్టాలిన్​ చెప్పారు.