చెన్నూరుకు చేసింది ఇదీ.. చేయబోయేది ఇదీ.. నువ్వేం చేశావ్ : వివేక్ వెంకటస్వామి

చెన్నూరుకు చేసింది ఇదీ.. చేయబోయేది ఇదీ.. నువ్వేం చేశావ్ : వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గానికి.. మా తండ్రి వెంకటస్వామి, నేను పదవుల్లో ఉన్నా.. లేకున్నా ఎంతో సేవ చేశామని.. చెన్నూరు నియోజకవర్గంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చేసినవి చెప్పుకునే ఓట్లు అడుగుతున్నామన్నారు వివేక్ వెంకటస్వామి. పదేళ్లు అధికారంలో ఉన్న బాల్క సుమన్ ఏం చేశాడో చెప్పుకోలేక.. నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

రామంగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయించటం ద్వారా ఎరువుల కొరతను తీర్చిన విషయాన్ని గుర్తు చేశారాయన. చెన్నూరులో అప్పట్లో ఎంపీగా ఉన్నప్పుడు వేయించిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయని.. కొత్తగా ఎందుకు వేయలేదని ప్రశ్నించారాయన. మందమర్రితోపాటు ఇతర ప్రాంతాల్లో మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన విషయాన్ని స్పష్టం చేశారు వివేక్ వెంకటస్వామి. 

సింగరేణి సంస్థ మూతపడే పరిస్థితుల్లో ఉండగా.. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకటస్వామి ఆ సంస్థను కాపాడి.. లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పించారన్నారు. సింగరేణి సంస్థను కాపాడటం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించామన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం ద్వారా.. ఏడు వేల మంది యువతకు ఉపాధి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు వివేక్ వెంకటస్వామి. 

విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ ద్వారా ప్రభుత్వ స్కూల్స్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని.. వసతులు కల్పించటం జరిగిందన్నారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా చెప్పుకొచ్చారాయన.

చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నానని.. గెలుపోటములతో సంబంధం లేకుండా పర్యటిస్తున్నట్లు వెల్లడించారాయన. ఈ పదేళ్లలో ఎప్పుడైనా బాల్క సుమన్ జనంలో తిరిగాడా.. జనం సమస్యలు పట్టించుకున్నాడా.. కనీసం ఫోన్లలో కూడా మాట్లాడలేదని.. ఈ విషయాన్నే జనం తన దృష్టికి తీసుకొస్తున్నట్లు వివరించారు వివేక్ వెంకటస్వామి.

చెన్నూరులో ముఖ్యంగా యువతలో నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయటంతోపాటు.. వచ్చే ఐదేళ్లలో 30 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు వివేక్ వెంకటస్వామి. ఇక నుంచి చెన్నూరులోనే ఉంటా.. చెన్నూరు జనం మధ్య ఉంటే.. ప్రతి సమస్య పరిష్కారానికి నేను గ్యారంటీ.. నేను భరోసా అంటూ హామీ ఇచ్చారాయన. రైల్వే ఓవర్ బ్రిడ్జి, మంచినీటి సమస్య, పేదలకు ఇళ్లు వంటి కాంగ్రెస్ పార్టీ పథకాలతోపాటు చెన్నూరు పట్టణాన్ని ఆదర్శ నియోజవర్గంగా అభివృద్ధి చేయటానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి.