భూగర్భ జలాలు తగ్గిపోతున్నయ్.. నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎమ్మెల్యే వివేక్

 భూగర్భ జలాలు తగ్గిపోతున్నయ్.. నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎమ్మెల్యే వివేక్

పెద్దపల్లి:  తెలంగాణలో తక్కువ వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని.. అందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏప్రిల్ 4వ తేదీ గురువారం జిల్లాలోని ధర్మారం మండలం కమ్మరిఖాన్ పెట్ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామ కృష్ణ రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మీడియాతో మాట్లాడుతూ..  ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా పని చేస్తామని చెప్పారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలన్నారు. సంవత్సరం క్రితం ఆలయ అభివృద్ధి కోసం గౌడ కులస్తులు తనతో చర్చించారని... వాళ్లు తనను ఎప్పుడు మర్చిపోలేదన్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని.. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మనకు బాధలు వస్తే దేవుడిని మొక్కుతం, పూజలు చేస్తాం.. ఇలాంటి సాంస్కృతి ఏ దేశంలో లేదని అన్నారు.

నాలుగేండ్లు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డితో కలిసి ప్రజల కోసం పనిచేశామన్నారు వివేక్. ఈ సంవత్సరం 60% వర్షాలు తక్కువ పడ్డాయని...అందుకే భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలి.. ముంబై లాంటి నగరాల్లో కూడా నీటి కష్టాలు తప్పడం లేదని ఆయన చెప్పారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అభివృద్ధి చేస్తామని వంశీకృష్ణ అన్నారు.