
- ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్‌లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను తర్వగా పూర్తిచేసేలా ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి అభివృద్ధి పనులపై జైపూర్‌లోని సింగరేణి థర్మల్పవర్ప్లాంట్లో రివ్యూ నిర్వహించారు. మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో 50 నుంచి 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన స్థలాలు, సాధ్యాసాధ్యాలపై రెవెన్యూ ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం చేపట్టిన అమృత్2.0 నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణాలపై చర్చించారు. సానిటేషన్, డంపింగ్ యార్డుల నిర్వహణపై దృష్టి సారించాలని, పవర్ సరఫరాలో అంతరాయాలు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తరగతి గదుల రిపేర్లు, ఫర్నీచర్ కొరత లేకుండా చూడాలని డీఈవో యాదయ్యను ఆదేశించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి, నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, సీపీవో సత్యం, డీఆర్డీవో కిషన్, డీఎంహెచ్‌వో హరీశ్ రాజ్, మున్సిపల్ కమిషనర్లు గద్దె రాజు, తుంగపిండి రాజలింగు, మురళీకృష్ణ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పలు శాఖల అధికారుల పాల్గొన్నారు.
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోమవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించి పలువురు వధూవరులను ఆశీర్వదించారు. రామకృష్ణాపూర్ అల్లూరి సీతారామరాజునగర్‌లో రాకేశ్–అఖిల, పాత తిమ్మాపూర్‌లో మామిడి శ్రవణ్–భవ్య, గద్దెరాగడి అమ్మ గార్డెన్స్ లో కుర్షింగ్ శివకుమార్–వైష్ణవి, మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగు కొడుకు సుహాస్–మాధురి దంపతులను ఆశీర్వదించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడిలో కాంగ్రెస్సోషల్మీడియా కోఆర్డినేటర్ కుర్మ సురేందర్, సుగుణాకర్ సోదరుల తండ్రి రామయ్య ఇటీవల చనిపోగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు.